హుజూరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటలకు ముగియనుంది. నియోజకవర్గంలో ఉదయం 11 గంటల వరకు 33.27 శాతం పోలింగ్ నమోదయింది. శనివారం తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
హుజూరాబాద్‌లో మొత్తం 2,36,283 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,18,720 మంది పురుష ఓటర్లు, 1,17,563 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఉప ఎన్నికలో 30 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు.
పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే హుజూరాబాద్, వీణవంక, కమలాపూర్, జమ్మికుంట మండలాల్లో భారీ సంఖ్యలో ఓట్లర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటుండగా, ఇల్లందకుంటలో కొంత నెమ్మదిగా కొనసాగుతున్నది. ఉదయం 11 గంటల వరకు హుజూరాబాద్‌లో 28.64 శాతం, వీణవంకలో 28.72 శాతం, జమ్మికుంటలో 27.03 శాతం, ఇల్లందకుంటలో 24.83 శాతం, కమలాపూర్‌లో 27.71 శాతం ఓట్లు నమోదయ్యాయి. కాగా, పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.