హనుమకొండ : నగరాలు, పట్టణాలు ప్రణాళికాబద్దంగా అభివృద్ధి జరిగేలా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో జీడబ్లూఎంసీ, కుడాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. ఆర్థిక సంవత్సరంలో మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన 10 అభివృద్ధి అంశాలను వివరించారు.
మున్సిపల్ శాఖలో 3,712 ఉద్యోగాల నియమాకానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని.. త్వరలోనే నియమాకాలు చేపట్టి సిబ్బంది కొరత తీర్చుతామని కేటీఆర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో 50వేల జనాభాకు ఒక వార్డు అధికారిని నియమిస్తామని అన్నారు. గ్రేటర్ వరంగల్లో వర్క్ ఇన్స్పెక్టర్లను నియమిస్తామని అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిబంధనల మేరకు లక్ష జనాభాకు 280మంది పారిశుధ్య కార్మికులు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మున్సిపాలిటీలకు మంజూరైన నిధులను ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలని సూచించారు. టీయూఎఫ్ఐడీసీ నిధులను వంద శాతం వినియోగించుకోవాలని ఆదేశించారు.