GDP | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్థిక ప్రగతి గత తొమ్మిదేండ్ల నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్నది. ఏ లక్ష్యంతోనైతే రాష్ట్రాన్ని సాధించుకున్నామో, ఆ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం ఏటికేడు ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. 2014-15లో రూ.1,24,104గా ఉన్న తెలంగాణ తలసరి ఆదాయం.. 2022-23వ ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 156% వృద్ధితో రూ.3,17,115కు ఎగబాకింది. ఈ క్రమంలో అనేక పెద్ద రాష్ట్రాలను వెనక్కి నెట్టడం ద్వారా 10 స్థానం నుంచి అగ్రస్థానానికి దూసుకెళ్లినట్టు ‘ఎకనమిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ @ 10’ నివేదిక స్పష్టం చేసింది. ఆర్థికంగా తెలంగాణ ఏటికేడు ఎదిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలో స్పష్టంగా పొందుపరిచింది. ఆ నివేదిక ప్రకారం.. గత 9 ఏండ్లలో దేశ తలసరి ఆదాయ వృద్ధిరేటు 98 శాతమే.
దేశం కంటే ‘తలసిరి’ వృద్ధి 58% ఎక్కువ
దేశంలో ఏ రాష్ట్రమైనా ఆర్థికాభివృద్ధిలో పక్క రాష్ట్రంతోనో, లేక మరో రాష్ట్రంతోనో పోటీపడడం సర్వసాధారణం. కానీ, తెలంగాణ మాత్రం ఏకంగా దేశంతోనే పోటీపడుతున్నది. నిరుడు తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,17,115 కాగా.. దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే. దీని కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,45,115 ఎక్కువ. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ తలసరి ఆదాయం 156% పెరిగింది. ఇదే సమయంలో దేశం తలసరి ఆదాయ వృద్ధిరేటు 98 శాతమే. దీని కంటే తెలంగాణ వృద్ధిరేటు 58% అధికం.
2014-15తో పోలిస్తే నిరుడు తెలంగాణ సాధించిన తలసరి ఆదాయం రూ.1,93,011, జాతీయ తలసరి ఆదాయం రూ.85,353 ఎక్కువ. దీనితో పోలిస్తే 2022-23లో తెలంగాణ రూ.1,07,658 అధిక తలసరి ఆదాయాన్ని సాధించింది. 2014-15లో దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.37,493 ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరంలో జాతీయ తలసరి ఆదాయం కంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,45,115 ఎక్కువ. ఇలా.. తలసరి ఆదాయంలో తెలంగాణ ఏటికేడు దేశంతో పోటీపడుతూ గణనీయ వృద్ధిని నమోదు చేస్తున్నది. దీంతో రాష్ట్ర, జాతీయ తలసరి ఆదాయాల మధ్య వ్యత్యాసం ఏటికేడు పెరుగుతూనే ఉన్నది.