DSC | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ అభ్యర్థుల ఆగ్రహ జ్వాల ఇంకా చల్లారలేదు. వెల్లువలా రగులుతూనే ఉన్నది. గురువారం నుంచి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో వేలాది మంది తమ జీవితాలను పణంగా పెట్టేందుకూ వెనుకాడలేదు. గొంతెత్తి మొత్తుకున్నా, ఆందోళనలు నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపడంతో గుండెలు మండిన ఆ అభ్యర్థులు పరీక్షలే రాయబోమంటూ ప్రభుత్వంపై నిరసన బాణం వదిలారు. ఏకంగా 31,105 మంది బుధవారం నాటికి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోలేదు. వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
ఈసారి డీఎస్సీకి మొత్తంగా 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 11న అధికారులు హాల్టికెట్లను వెబ్సైట్లో పొందుపరిచారు. బుధవారం నాటికి 2,48,851 మంది మాత్రమే హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, దమనకాండకు నిరసనగా వీరంతా పరీక్షలు రాయకుండా తమ నిరసనను వ్యక్తంచేస్తున్నారు. వందలాదిమంది డౌన్లోడ్ చేసుకున్న తమ హాల్టికెట్లను కాల్చివేసి నిరసన తెలిపారు. తమకు ప్రిపేరేషన్కు తగిన సమయం ఇవ్వలేదని, తాము పరీక్ష రాయబోమంటూ.. సర్కారుపై మండిపడుతున్నారు.
ఒక్కో ప్రశ్నకు అర మార్కు
డీఎస్సీ పరీక్షలో 160 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు అర మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఆఫైర్స్ నుంచి 20 మార్కులు, విద్యా దృక్పథాల నుంచి 20, కంటెంట్ (నాన్ లాంగ్వేజస్ అండ్ లాంగ్వేజస్) నుంచి 88, బోధనా పద్ధతుల నుంచి 32 కలిపి మొత్తం 160 ప్రశ్నలకు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. టెట్ పరీక్షకు 20 మార్కుల వెయిటేజీ ఉండగా, అభ్యర్థులు సాధించిన మార్కుల ప్రకారం వెయిటేజీని అమలుచేసి మొత్తం 100 మార్కులుగా లెక్కలోకి తీసుకుంటారు. స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), పీఈటీ పోస్టులకు టెట్ లేకపోవడంతో వీరికి మాత్రం 200 ప్రశ్నలతో 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు.