హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఖజానాను నింపుకొనేందుకు ఎన్నో ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశం వచ్చినా అందిపుచ్చుకుంటున్నది. ఈ నెలాఖరున ప్రజలందరూ పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీ ఎత్తున వేడుకలు జరుపుకోనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతిఏటా విందులు, వినోదాలలో మద్యం ఏరులై పారుతుంది. అందివచ్చిన అవకాశాన్ని పూర్తిగా ‘క్యాష్’ చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అందులోభాగంగా ఈ నెల 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మద్యం అమ్ముకోవడానికి, విచ్చలవిడిగా మందు తాగడానికి ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. ఈ మేరకు మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు విడుదల చేశారు. డిసెంబరు 31న బార్లకు, క్లబ్‌లకు, ఈవెంట్ పర్మిషన్ తీసుకున్న వారికి, టూరిజం ప్రాంతాల్లో రాత్రి ఒంటి గంట వరకు మద్యం సేవించడానికి అనుమతి ఇచ్చారు. ఇక ఏ4 షాపులు (మద్యం షాపులకు) రాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుపుకోవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేరొన్నారు.
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎక్సైజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 27 నుంచి 29 వరకు ఎన్డీపీఎల్, ఎన్‌డీపీఎస్‌లపై దాడులు జరుగుతాయని.. 30, 31న ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం తెలిపారు. ప్రధానంగా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, గంజాయి, డ్రగ్స్‌పై దాడులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వరంగల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐడీ లికర్ (నాటుసారా లికర్) దాడులు నిర్విహిస్తారని తెలిపారు. డిసెంబరు 30, 31 తేదీల్లో ప్రత్యేక ఈవెంట్లు, వాహన తనిఖీలు, రూట్ వాచ్ చేపట్టి నాన్‌డ్యూటీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతోపాటు తెలంగాణలో ఉన్న 20 చెక్ పోస్టుల్లోను, రైళ్లు, వాహనాల్లోనూ అక్రమంగా తరలించే మద్యాన్ని అరికట్టడానికి చర్యలు చేపట్టనున్నట్టు ప్రకటించారు.