న్యూఢిల్లీ, డిసెంబర్ 23: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్.. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఐదేండ్లలో ఐదు కొత్త ఈవీలను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. దీంట్లో ప్రీమియం మాడల్ అవిన్యాతోపాటు మిగతా నాలుగు మాడళ్లు ఉన్నాయని కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీల మార్కెట్లో 45-50 శాతం మార్కెట్ వాటా పెటుకున్న సంస్థ అందుకు తగ్గట్టుగానే ప్రణాళికను వేగవంతం చేసినట్లు, ఇక నుంచి ప్రతియేటా ఒక కొత్త మాడల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
ఇందుకోసం వచ్చే ఐదేండ్లకాలంలో రూ.16 వేల కోట్ల నుంచి రూ.18 వేల కోట్ల వరకు పెట్టుబడి పెట్టనున్నట్టు తెలిపారు. ఈవీలను తయారు చేయడానికి, 10 లక్షల చార్జింగ్ పాయింట్లను నెలకొల్పడానికి ఈ నిధులను ఖర్చు చేయనున్నది. భారత్‌లో ఈవీల వినిమయం టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నదని, దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ఈవీల్లో రెండింట మూడోవంతు టాటా కార్లేనని ఆయన పేర్కొన్నారు. టియోగో, పంచ్, నెక్సాన్, కర్వీ, హారియర్లు ఈవీ మాడళ్లుగా లభిస్తుండగా…భవిష్యత్తులో సియారా, నూతన పంచ్ ఈవీలను వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.