న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈ ఏడాది ఐపీవోల జాతర నడిచింది. మునుపెన్నడూ లేనివిధంగా నిధుల సమీకరణ జరిగింది. 2025లో 103 ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)లు రాగా.. ఆల్‌టైమ్ హైలో రూ.1.76 లక్షల కోట్ల ఫండ్స్‌ను ఆయా కంపెనీలు చేజిక్కించుకున్నాయని ఐపీవో సెంట్రల్ తాజా గణాంకాలు చెప్తున్నాయి. భారీ, మధ్య, చిన్నశ్రేణి సంస్థలన్నింటి ఐపీవోలను గమనిస్తే.. ఇష్యూ పరిమాణం సగటున రూ.1,700 కోట్లుగా ఉన్నది. టెక్నాలజీ, ఆర్థిక సేవలు, మౌలిక, ఇంధన, కన్జ్యూమర్ రంగాల్లోని సంస్థలు ఈసారి ఎక్కువగా పబ్లిక్ ఇష్యూకు వచ్చినట్టు తేలింది. నిజానికి ఈ ఏడాది మొదటి ఏడు నెలలు భారతీయ స్టాక్ ఎక్సేంజీలు తీవ్ర ఒడిదుడుకుల్లోనే సాగాయి. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరుల (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల ఉపసంహరణలు వంటివి ప్రధానంగా మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఆగస్టు నుంచి పరిస్థితులు చక్కబడ్డాయి. దీంతో లిస్టింగ్లూ ఊపందుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఏడాది ఐపీవోలలో టాటా క్యాపిటల్ అత్యధికంగా రూ.15,512 కోట్లను సమీకరించింది. ఆ తర్వాత హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (రూ.12,500 కోట్లు), ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా (రూ.11,607 కోట్లు), హెక్సావేర్ టెక్నాలజీస్ (రూ.8,750 కోట్లు), లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ (రూ.7,278 కోట్లు), బిలియన్‌బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్ (రూ.6,632 కోట్లు) ఐపీవోలున్నాయి. కాగా, మొత్తం 103 ఐపీవోలలో 70 సంస్థలు లిస్టింగ్ రోజున లాభాలను అందుకున్నాయి. 32 కంపెనీలు తొలిరోజు నష్టాలనే చవిచూశాయి. ఈ ఏడాది ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 10 శాతానికిపైగా, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 9 శాతానికిపైగా పెరిగాయి.
చిన్న మదుపరులు స్టాక్ మార్కెట్ ఆధారిత పెట్టుబడులకు ఈ ఏడాది అమితాసక్తిని కనబర్చారు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణార్థం క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలు కూడా కలిసొచ్చాయని ట్రేడర్లు విశ్లేషిస్తున్నారు. గతంతో పోల్చితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై చిన్న మదుపరులలో అవగాహన పెరిగిందని అంటున్నారు. కాగా, పబ్లిక్ ఇష్యూల ద్వారా సేకరించిన నిధులను వ్యాపార విస్తరణ, వర్కింగ్ క్యాపిటల్, రుణ భారాన్ని తగ్గించుకోవడానికే కంపెనీలు ఎక్కువగా వినియోగించినట్టు ఐపీవో వివరాలను చూస్తే తెలుస్తున్నది.
వచ్చే ఏడాది కూడా ఐపీవోలు పెద్ద ఎత్తునే రాబోతున్నాయి. సెబీ నుంచి ఇప్పటికే 75 సంస్థలు ఐపీవోలకు అనుమతుల్ని పొందాయి. ఇవన్నీ కూడా తమ పబ్లిక్ ఇష్యూలను ఖరారు చేయాల్సి ఉన్నది. ఇక మరో 100 కంపెనీలు సెబీ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాయి.
-భవేశ్ షా, ఈక్విరస్ క్యాపిటల్ ఎండీ