హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో 30వేలకుపైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ప్రభుత్వం తక్షణం స్పందించి భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రత్యేకంగా లేఖ రాసి దానిని ఆదివారం విడుదల చేశారు. గతేడాది టీచర్ పోస్టులను భర్తీ చేసినా వివిధ కారణాలతో అన్ని పోస్టులు భర్తీ కాలేదని, ఇంకా పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. మరోవైపు లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. 12 వేల పాఠశాలల్లో ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్స్ పాఠాలను చెప్పేవారే లేకుండా పోయారని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.