దామరగిద్ద, ఆగస్టు 29 : నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కానుకుర్తి, గడిమున్కన్‌పల్లిలో ఉద్రిక్తత నెలకొన్నది. కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణకు వచ్చిన అధికారులపై రైతాంగం తిరగబడింది. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం భూములను సర్వే చేయడానికి శుక్రవారం తెల్లవారుజామునే అధికార యంత్రాం గం చేరుకుంది. విషయం తెలుసుకున్న సుమారు 150 మంది రైతులు కానుకుర్తి గ్రామ శివారులోని బాపన్‌గుట్ట వద్ద అధికారులను అడ్డుకున్నారు. మరోవైపు గడిమున్కపల్లి నిర్వాసితులు 120 మంది రోడ్డుపై బైఠాయించి, అధికారులు సర్వేకు వెళ్లకుండా తిరగబడ్డారు. దీంతో వందలాది మంది పోలీసులు రెండు ప్రాంతాలకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కానుకుర్తికి చెందిన మహిళా రైతు మల్లమ్మ సొమ్మసిల్లి పడిపోయింది.
వెంటనే తోటి రైతులు ఆమెను దవాఖానకు తరలించారు. మరో రైతు భీమప్ప తమ భూములు లాక్కోవద్దని అక్కడే ఉన్న ఓ అధికారి కాళ్లపై పడి వేడుకున్నాడు. మార్కెట్ ధర చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలని కోరాడు. మా భూములు దౌర్జన్యంగా తీసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని పురుగు మందు డబ్బాలు, పెట్రోల్ బాటిళ్లు చేత పట్టుకొని హెచ్చరించారు. దాదాపు ఐదు గంటల పాటు కదలకుండా అన్నదాతలు నిరసన తెలియజేశారు. కానుకుర్తి వద్ద నచ్చజెప్పినా రైతులు వినకపోవడంతో, గడిమున్కన్‌పల్లిలో నిర్వాసితుల వద్దకు అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వెళ్లి మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రైతులకు ఎకరాకూ రూ.14 లక్షల చొప్పున వచ్చాయని, ఒక వేళ ప్రభుత్వం పరిహారం పెంచితే దానికి తగ్గట్టుగానే అందరి రైతులకు వర్తిస్తుందని తెలిపారు.అయినా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో, చేసేదేమీ లేక అధికారులు, పోలీసులు వెనక్కి వెళ్లిపోయారు.
మక్తల్/ఊట్కూరు, ఆగస్టు 29 : కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతుల పక్షాన శాంతియుతంగా పోరాటం చేస్తున్న రైతు కూలీ సంఘం నాయకులను అక్రమ అరెస్టు చేయడం ఏమిటని భూ నిర్వాసితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం ఉదయం 6 గంటలకే భూనిర్వాసితుల నారాయణపేట జిల్లా అధ్యక్షుడు వెంకటరామారెడ్డితో పాటు పలువురుని అరెస్టు చేసి ధన్వాడ పోలీస్ స్టేషన్ వద్దకు తరలించారు. అరెస్టులను నిరసిస్తూ కాట్రేవుపల్లి, ఎర్నాగానిపల్లి, కాచ్వార్ గ్రామాల భూ నిర్వాసితులు మక్తల్‌లో నిరసన తెలిపారు. అలాగే ఊట్కూర్‌లో అఖిలపక్ష నాయకులు, భూ నిర్వాసితులు నల్ల రిబ్బన్లు ధరించి తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. రైతులకు న్యాయపరమైన పరిహారం అందించేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.