రంగారెడ్డి జిల్లా వెల్దండ, మాడ్గుల మండలాల్లోని కుందారం భూములపై అరాచకకాండ రాజ్యమేలుతున్నది. మారిన ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్తో లబ్ధి పొందేందుకు వీలుగా 400 ఎకరాలను చెరపట్టడమే లక్ష్యంగా దళారీ దందా సాగుతున్నది. ఓ కీలకనేత సోదరులు, సంబంధీకులూ వీరిలో ఉన్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
‘భూములిస్తారా.. మేమే లాక్కోవాల్నా’ అని రైతులను బెదిరించి ఇప్పటికే అడ్డికి పావుసేరుగా వంద ఎకరాలు కొనేశారు. ‘కబ్జా స్వాధీనపత్రం’ అంటూ ప్రపంచంలో ఎక్కడా లేని పత్రాలపై సంతకాలు చేయించుకుని ప్రైవేటు ఒప్పందాలు చేసుకుంటున్నారు. నయీం అనుచరులను దింపి మాట వినని రైతులను బెదిరిస్తున్నారు. అజలాపురం నుంచి కుందారం తండా దాక ఇదే భయానక వాతావరణం! రైతుల నుంచి గ్రామస్తుల వరకు ఒకే భీతిల్లిన దృశ్యం!
RRR Alignment | (నమస్తే తెలంగాణ నెట్వర్క్) : అజలాపురం… దశాబ్దమున్నర కిందటివరకు సమైక్య రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం అనతికాలంలోనే మావోయిస్టులకు అడ్డాగా మారింది. కమ్యూనిస్టులు చెప్పే భూ పోరాటాలకు నికార్సయిన వేదికగా నిలబడింది. ప్రాణత్యాగాలు చేసి భూపోరాట జెండాను రెపరెపలాడించింది. ప్రభుత్వ, అధికార యంత్రాంగం కదిలివచ్చి అధికారికంగా భూములను పంపిణీ చేసేదాకా అజలాపురం విశ్రమించలేదు. అలా వందలాదిమంది భూమిలేని నిరుపేదలకు భూ హక్కులు కల్పించిన ఈ అజలాపురం చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు అల్లకల్లోలంగా మారాయి. నాడు పోరాడి సాధించుకున్న భూముల్లో నేడు దళారీ దందాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి.
బెదిరించో, భయపెట్టో భూములు గుంజుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో భూములపై తమ హక్కులను రైతులే గుగ్గిళ్లకు గుర్రాలను అమ్ముకున్నట్టు అర్పించుకోవాల్సిన అగత్యంలోకి నెడుతున్నారు. భూ రికార్డుల్లోని గందరగోళాన్ని అడ్డుపెట్టుకొని అధికారపార్టీకి చెందిన ఓ కీలక నేత సంబంధీకులు, సోదరులు కుందారం భూములను చెరపడుతున్నట్టు ఆ గ్రామాల్లో ప్రచారం జరుగుతున్నది. అందుకోసం గతంలో నయీం అనుచరులుగా వ్యవహరించినవారినీ రంగంలోకి దింపి భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు చెప్తున్నారు.
కుందారం భూములంటేనే తెలంగాణవ్యాప్తంగా ప్రసిద్ధి. గతంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే వెల్దండ మండలంలోని అజలాపురం, బైరాపూర్, మాడ్గుల మండలంలోని అంతిరెడ్డిపల్లి, దిలావార్ఖాన్పల్లి, ఇర్విన్, కుందారం తండా, లాల్తండాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రంగారెడ్డి జిల్లా ఇర్విన్ గ్రామ పరిధిలోకి వస్తున్నాయి. పూర్వం ఈ భూముల వనపర్తి సంస్థానం రంగనాయకమ్మకు చెందినవి. అనంతరం నిజాం కాలంలో భూశిస్తు అమలులో ఉండేది. ఒకవేళ ఎవరైనా తమ భూములకు శిస్తు చెల్లించనట్టయితే ఇతరులు ఎవరైనా ఆ భూములకు వాస్తవ మొత్తంలో సగం చెల్లించినా అవి వారి పేరిట కొనసాగేవి. అలా సగం శిస్తు ఇతరులు చెల్లించిన భూములను మక్త భూములు అంటారు.
అలా అజలాపురం గ్రామానికి చెందిన కుందారం వంశీయుల ఆధీనంలోకి ఈ మక్త భూములు వెళ్లాయి. ఇలా ఇర్విన్ గ్రామ పరిధిలోని సర్వేనెంబరు 1003 నుంచి 1053 వరకు దాదాపు 700 ఎకరాలకు పైగా భూములు రెవిన్యూ రికార్డుల్లో రఘుమారెడ్డి, గీతారెడ్డి, సీతారెడ్డి, మోహన్‌రెడ్డి పేర్ల మీద వస్తున్నాయి. వాస్తవానికి కుందారం వంశీయులు ఈ భూములను సాగు చేయకపోవడంతో గ్రామంలోని నిరుపేద రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. కుందారం వంశీయులు చాలామంది ఏండ్ల కిందటే విదేశాల్లోను, హైదరాబాద్‌లోనూ స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ భూములను సాగు చేసుకుంటున్న వారిని అందులో నుంచి వెళ్లిపోవాలని కుందారం వంశీయులు హెచ్చరించడం, తమకు గత్యంతరం లేదు.. భూములను సాగు చేసుకుంటామని వాళ్లు వేడుకోవడం… ఏండ్ల తరబడి ఇదే కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 90వ దశకంలో నక్సల్స్ ప్రాబల్యం ఈ గ్రామంలో మొదలవడం జరిగింది.
అజలాపురానికి చెందిన పాతతరం వారు చెప్తున్న వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ బీఎడ్ చేసిన ఆ ప్రాంతానికి చెందిన కూన నిరంజన్ అనే యువకుడు కుందారం భూములపై పేద రైతులకు హక్కు కల్పించాలనే లక్ష్యంతో నక్సల్స్ వైపు ప్రభావితం అయ్యాడు. అనంతరం ఇలా గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఒకరిద్దరు యువతీ యువకులు ప్రభావితులై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా అప్పట్లో పీపుల్స్‌వార్‌కు అజలాపురం గ్రామ పరిసరాల్లో గణనీయమైన పట్టు వచ్చి, సేఫ్టీ జోన్‌గా కూడా మారింది. ఈ క్రమంలో కుందారం వంశీయులు ఒక్కరు కూడా గ్రామంలో ఉండే పరిస్థితి లేకుండా పోయింది.
కనీసం పోలీసులు సైతం ఆ గ్రామాల పరిసరాల్లోకి వెళ్లే పరిస్థితులు ఉండేవి కావని కొందరు గ్రామస్థులు తెలిపారు. ఇలా పీపుల్స్‌వార్ ఆధ్వర్యంలోనే కుందారం భూములు నిరుపేద రైతులకు పంపిణీ చేశారని చెప్తున్నారు. ఇక్కడ విశేషమేమిటంటే… 700 ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా ఇప్పటికీ రాళ్లు, రప్పలు లేకుండా సాగవుతున్నదంటే ఆదినుంచీ రైతులు నిరంతరాయంగా ఈ భూములను సాగు చేశారని అర్థమవుతున్నది. అయితే పేద రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ రెవిన్యూ రికార్డుల్లో మాత్రం కుందారం వంశీయుల పేర్లే కొనసాగాయి.
ఈ భూములపై కన్నేసిన ‘బిగ్-బ్రదర్స్’ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు ట్రిపుల్-ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో మార్పు చేశారు. దీంతోపాటు ఆమనగల్-రావిర్యాల గ్రీన్‌ఫీల్డ్ 300 ఫీట్ల రహదారిని కూడా దీనికి సమీపంలోనే ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మరోవైపు కొందరు వ్యక్తులను రంగంలోకి దించి పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇందులోనే నయీం అనుచరులు కీలకపాత్ర పోషిస్తున్నట్టు గ్రామస్తులు కొందరు తెలిపారు. ముఖ్యంగా ఓఆర్సీ, పాసు పుస్తకాలు లేకుండా కబ్జాలో ఉన్న రైతులను ముందుగా టార్గెట్ చేశారు. ‘ఎలాగూ మీకు డాక్యుమెంట్లు లేవు… ఎంతోకొంతకు అమ్ముకుంటే ఇప్పుడు పైసలొస్తయి. లేదంటే భూమి నుంచి వెళ్లగొడ్తరు. మేం ఎలాగోలా సీసీఎల్ఏలో రికార్డుల్లో నమోదు చేసుకుంటాం’ అని చెప్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు.
భూములియ్యబోమని మొండికేసినవారిని బెదిరిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ ఎకరా రూ.30 లక్షల నుంచి 40 లక్షల వరకు ధర పలుకుతుండగా… కేవలం రూ.3-4 లక్షలకే కొనుగోలు చేసుకొని, ప్రైవేటు ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆపై ఓఆర్సీ ఉండి, భూమిపై ఉన్న వారిని కూడా బెదిరిస్తున్నారు. రికార్డుల్లో తక్కువ ఉండి, కబ్జాలో ఎక్కువ ఉన్నందున మొత్తానికి ఒక రేటు నిర్ధారించి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు వందెకరాలకు పైగా భూమిని ఇలా కొనుగోలు చేసినట్టు సమాచారం. అయితే ఓఆర్సీ ఉండి పాసు పుస్తకాలు లేకుండా, కబ్జా మీద లేనివారు ఇప్పుడు వీరిచుట్టూ తిరుగుతున్నారు. మాకు ఓఆర్సీ ఉంది.. పైసలు మాకియ్యాలి అంటూ వేడుకున్నా కనికరించడంలేదని కొందరు రైతులు ‘నమస్తే తెలంగాణ’తో ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుకు, భూమితో ఉండేది అవినాభావ బంధం. డాక్యుమెంట్లు లేకున్నా, ప్రభుత్వ రికార్డుల్లో పేరు లేకున్నా.. ఏండ్ల తరబడి భూమిని నమ్ముకొని సాగు చేస్తున్న రైతులు ఎప్పటికైనా తమను ప్రభుత్వం గుర్తించకపోతదా! పట్టా ఇయ్యకపోతదా!! అని ఎదురుచూస్తరు. అంతేకానీ భూమిని వదిలిపెట్టిపోడు. మరి అలాంటిది దశాబ్దాలుగా రెండు, మూడు తరాలు సాగు చేసిన భూమి నుంచి రాత్రికి రాత్రి పొమ్మంటే ఆ రైతు ప్రాణం ఎంత తండ్లాడుతది? కుందారపు భూముల్లో ఇప్పుడు అదే జరుగుతున్నది.
ప్రపంచంలో ఎక్కడైనా భూమి అమ్మేందుకు, కొనేందుకు ఒప్పంద పత్రాలు చూశాం! కానీ రైతు భూమిని అడ్డికి పావుశేరులా కొని ఆ రైతును వెళ్లగొట్టేందుకు ‘కబ్జా రద్దు ఒప్పంద పత్రం’ ఎక్కడైనా చూశామా?! ఇది అదే! వందల ఎకరాలపై కన్నేసిన కొందరు వ్యక్తులు ఇలా బెదిరింపులకు దిగి.. భూమిని సాగు చేస్తున్నా, ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కేది లేదు. ఆపై వెళ్లగొడితే వచ్చే నాలుగు పైసలు కూడా రావంటూ బెదిరించి ఇలా కబ్జా నుంచి వెళ్లగొడుతున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని చుట్టూ కడీలు పాతుకుంటున్నారు.
భూరికార్డుల గందరగోళం కుందారంలో భూదందాకు దారితీస్తున్నది. ఆ రికార్డులను అడ్డుపెట్టుకుని, అధికారం అండచూసుకుని.. సదరు సోదరులు రైతుల భూములను చెరపడుతున్నారు. తెలంగాణకు నయీం పీడ విరుగడైందనుకుంటున్న తరుణంలో.. మళ్లీ నయా నయీంలను సృష్టిస్తున్నారు. గతంలో నయీంకు అనుచరులుగా వ్యవహరించినవారు కొందరు కుందారం భూముల దందాలోకి దిగారు. ఒకటీ అరా కాదు… ఏకంగా నాలుగు వందలకు పైగా ఎకరాలే లక్ష్యంగా ఈ బలవంతపు కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు వంద ఎకరాలకు పైగా ఒప్పందాలు పూర్తయ్యినట్టు సమాచారం. ‘ఉన్న భూమిని అమ్ముతవా? లేదా??’ అన్న రీతిలో ఈ దౌర్జన్యకాండ కొనసాగుతున్నది.
ఈ గ్రామాల్లోని ఏ ఒక్క రైతును కదిలించినా.. హడలెత్తిస్తున్న భూదందా మీదనే గోడు వెల్లబోసుకుంటున్నాడు. ఏ ఒక్క రాజకీయ నాయకుడిని కదిపినా.. నయీం అనుచరుల పేర్లు ఉచ్ఛరిస్తూ వణికిపోతున్నారు. అంతేకాదు… కుందారం భూములకు సమీపంలోనే ట్రిపుల్ ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ మార్పు జరగడంతోపాటు ఆమన్‌గల్-రావిర్యాల 300 ఫీట్ల గ్రీన్‌ఫీల్డ్ రహదారి సైతం ఈ భూముల లక్ష్యంగానే నిర్మాణం అవుతున్నదంటే.. కుట్రకు ఏ స్థాయిలో ప్రణాళికలు రచించారో అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో ఏర్పడిన వైఎస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడం.. తదనంతర పరిణామాల తర్వాత ఈ గ్రామంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. 1972 ల్యాండ్ సీలింగ్ యాక్టు ప్రకారం 2006లో అప్పటి ప్రభుత్వం అందులోని 493.10 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. మిగిలిన భూములు కుందారం వంశీయుల వద్దే ఉన్నాయి. కానీ ఆ భూములు తమవేనంటూ అప్పట్లోనే కుందారం వంశీయులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కాగా సీలింగ్ యాక్టు ప్రకారం సేకరించిన భూములను.. భూమిలేని నిరుపేదలకు అధికారికంగా పంపిణీ చేసేందుకు అప్పటి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఉషారాణి నేతృత్వంలో పెద్దఎత్తున కసరత్తు జరిగింది.
306 మంది రైతులకు ఈ భూములను పంపిణీ చేసేందుకుగాను వారికి ఓఆర్సీ (ఓనర్షిప్ రైట్ సర్టిఫికెట్) కూడా జారీ చేశారు. కానీ ఇందులో 138 మంది రైతుల పేర్లు మాత్రమే రెవిన్యూ రికార్డుల్లోకి ఎక్కి.. వారికే పట్టా పాసుపుస్తకాలు జారీ అయ్యాయి. ఈ లోగా కుందారం వంశీయులు కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడంతో మిగిలిన వారికి పాసు పుస్తకాలు జారీ అయ్యేందుకు అధికారులు కోర్టు కేసును సాకుగా చూపారు. అయినప్పటికీ సీలింగ్ యాక్టు కింద సేకరించిన భూములన్నింటినీలోనూ రైతులు కబ్జా మీద ఉండి సాగు చేసుకుంటూనే ఉన్నారు. ఇలా కుందారం భూముల్లో సాగు చేసుకుంటున్నవారు మూడు రకాలుగా ఉన్నారు.
1. ప్రభుత్వం జారీ చేసిన ఓఆర్సీ ఉండి.. క్షేత్రస్థాయిలో భూ కబ్జాలో ఉన్నవారు. వీరిలోనూ కొందరు ఓఆర్సీ, పాసు పుస్తకాల్లో ఉన్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో (కొంతమంది 7-10 ఎకరాల్లో) సాగు చేసుకుంటున్నారు.
2. క్షేత్రస్థాయిలో భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ ఆ రైతులకు ఓఆర్సీగానీ, పాసు పుస్తకాలుగానీ లేవు.
3. 2006లో 306 మంది రైతులకు ఓఆర్సీలు జారీ కాగా.. వీరిలో 168 మందికి ఓఆర్సీలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో భూ కబ్జాలో లేరు. కేవలం ఓఆర్సీలు మాత్రమే ఉన్నాయి.
ఈ భూదందాకు సంబంధించిన వివరాలు మీ దగ్గర ఉంటే మాకు వాట్సాప్ చేయండి 91827 77711