TGSRTC | హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తేతెలంగాణ): ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య పెరిగింది. ఇప్పటికే 2,800 ప్రైవేటు బస్సులు ఉండగా, మరో 3 వేల బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 9,800 బస్సులు ఉన్నాయి. వీటిల్లో ప్రైవేటు వ్యక్తులు ఆర్టీసీకి అద్దెకిచ్చిన బస్సులు 2,800 ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో ఆర్టీసీలో అద్దె బస్సుల వాటా 17 శాతం మాత్రమే. ఆర్టీసీకి ఇవ్వాల్సిన గ్రాంట్లు ఇవ్వకపోవడం, బకాయిలు పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అద్దె బస్సులను పెంచుతూ వస్తున్నారు. ఇలా పెంచుకుంటూపోతే .. రానున్నరోజుల్లో ఆర్టీసీలో సొంత బస్సులు ఉండే అవకాశమేలేదని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అద్దె బస్సుల సంఖ్యను పెంచడాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అద్దె బస్సులకు డ్రైవర్లను వాటి నిర్వాహకులే నియమిస్తుండటంతో.. డ్రైవర్ల జీతాల ఖర్చు తగ్గుతుందని ఆర్టీసీ యాజమాన్యం భావిస్తున్నది.
ఎలక్ట్రిక్ బస్సులన్నీ అద్దె బస్సులే..
ఆర్టీసీలో కొత్తగా తీసుకుంటున్న ఎలక్ట్రిక్ బస్సులన్నీ అద్దె ప్రాతిపదికనే తీసుకుంటున్నారు. ‘ఫేమ్’ పథకం కింద హైదరాబాద్ విమానాశ్రయానికి తిప్పుతున్న 40 ఎలక్ట్రిక్ బస్సులు, ఇటీవల మరో 100 ఎలక్ట్రిక్ బస్సులు ఒలెక్ట్రా సమకూర్చింది. వీటితో పాటు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ మరో 90 ఎలక్ట్రిక్ బస్సులు సమకూర్చింది. కొత్తగా వచ్చిన మరో 40 బస్సులను ప్రారంభించాల్సి ఉంది. ఇలా ప్రస్తుతం మొత్తం బస్సుల్లో అద్దె బస్సుల వాటా దాదాపు 30 శాతానికి చేరింది.
మూడేండ్లలో 8వేల బస్సులు
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ‘పీఎం-ఈ డ్రైవ్’ పథకం కింద 2,800 బస్సులు మంజూరు చేయాలని ఆర్టీసీ దరఖాస్తు చేసింది. దేశవ్యాప్తంగా ఆ పథకం కింద ఎలక్ట్రిక్ బస్సులు తిప్పేందుకు కేంద్రం 9 నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్ కూడా ఒకటి. ఆర్టీసీ దరఖాస్తు మేరకు ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కానున్నాయి. తాజాగా మహిళా సంఘాలు 1,000 బస్సులను ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మూడేళ్లలో అద్దె బస్సుల సంఖ్య 8వేలకు చేరే అవకాశం ఉంది. అద్దె బస్సులు భారీగా వస్తున్నందున సొంత బస్సులు కొనేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని ఆర్టీసీ కార్మికులు పేర్కొంటున్నారు.