హైదరాబాద్, జూలై 15(నమస్తే తెలంగాణ): రోడ్ల నాణ్యత లోపాలపై ప్రభుత్వం కొరడా ఝళిపించింది. నాలుగేండ్లలో 15 వేల పనుల్లో లోపాలు గుర్తించి సంబంధిత కాంట్రాక్టర్లకు దాదాపు రూ.30 కోట్ల జరిమానాలు విధించింది. ఈ ఏడాది కొత్త రోడ్ల నిర్మాణంతోపాటు రూ.2500 కోట్లతో రోడ్ల మరమ్మతులకు నడుంబిగించిన రోడ్లు, భవనాలశాఖలోని క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగాలు ఎప్పటికప్పుడు రోడ్ల నాణ్యతను పరిశీలిస్తుంటాయి. వచ్చిన ఫిర్యాదులపైనా ఇవి తనిఖీలు చేపడతాయి. ఈ క్రమంలో గత నాలుగేండ్లలో చేసిన తనిఖీల్లో దాదాపు 15 వేల పనుల్లో నాణ్యత లోపాలను అధికారులు గుర్తించారు.
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్ధారిత ప్రమాణాల ప్రకారం రోడ్లు నిర్మించని కాంట్రాక్టర్లు, వర్క్ ఏజెన్సీలకు జరిమానా విధించడంతోపాటు తదుపరి పనులు చేపట్టకుండా బ్లాక్‌లిస్టులో పెట్టారు. గత నాలుగేళ్లలో ఆర్అండ్బీ క్వాలిటీ కంట్రోల్ విభాగం 14,975 పనుల్లో లోపాలను గుర్తించి రూ. 28.70 కోట్ల జరిమానాలు విధించింది. వాటిలో ఇప్పటి వరకు రూ. 20.93 కోట్లు వసూలు చేసింది. విజిలెన్స్ విభాగం 14 పనుల్లో లోపాలు గుర్తించి రూ.32.53 లక్షల జరిమానాలు విధించగా, ఇప్పటి వరకు రూ.5.59 లక్షలు వసూలు చేసింది.