కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టు (Kondagattu) వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంతో ఓ వివాహం నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో మూడునెలల చిన్నారి మరణించగా, వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. నాందేడ్‌కు చెందిన పెండ్లి బృందం హుజూరాబాద్‌కు కారులో వెళ్తున్నది. అందులో వరుడితోపాటు మరికొందరు ఉన్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 4 గంటల సమయంలో కొండగట్టు పంచముఖ ఆంజనేయ స్వామి రోడ్డు సమీపంలో ఓ మామిడికాయల లోడుతో వెళ్తున్న డీసీఎం.. కారును ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు ముందు భాగంగా నుజ్జునుజ్జు అయింది.
దీంతో అందులో ఉన్న పెండ్లికొడుకుతోసహా ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మూడు నెలల బాలుడు రుద్ర అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ప్రమాదం నేపథ్యంలో వివాహం నిలిచిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.