సత్తుపల్లి, నవంబర్ 15 : చనిపోయిన వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి రూ.3 లక్షలు స్వాహా చేసిన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పట్టణ పరిధిలోని హనుమాన్‌నగర్‌కు చెందిన ఆలేటి ప్రసాద్(45) మూడునెలల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ సమయంలోనే ప్రసాద్ ఫోన్ చోరీకి గురైంది. ఆ ఫోన్ నుంచి ఫోన్ పే యాప్ ద్వారా రూ.3 లక్షలు పలు దఫాలుగా ట్రాన్స్ఫర్ జరిగింది.
శుక్రవారం ప్రసాద్ కుటుంబసభ్యులు బ్యాంక్‌కు వెళ్లి నగదు విత్‌డ్రా చేసేందుకు యత్నించగా అకౌంట్లో ఉన్న నగదు బదిలీ అయినట్టు బ్యాంకు సిబ్బంది తెలిపారు. వెంటనే కుటుంబసభ్యులు సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సత్తుపల్లి పట్టణంలోని మెయిన్‌రోడ్డులో గల ఓ ఆన్లైన్ సెంటర్ వారికి ఈ నెల 1న గుర్తుతెలియని వ్యక్తి రూ.48 వేలు ట్రాన్స్ఫర్ చేసి కమీషన్ రూపంలో నగదు తీసుకెళ్లినట్టు సీసీ కెమెరాలో నమోదైంది. కేసును త్వరలోనే ఛేదించనున్నట్టు పోలీసులు తెలిపారు.