హైదరాబాద్ (హిమాయత్‌నగర్), ఆగస్టు 2: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాల ప్రజాసంఘాల జేఏసీ చైర్మన్ చెన్నయ్య తెలిపారు. వీటిని విజయవంతం చేయడానికి మాలలు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రిజర్వేషన్ల కు భంగం కలిగించేలా ఉన్నదని చెప్పారు. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన త ర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, తీర్పును పునఃపరిశీలించాలని కోరుతామని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని తెలిపారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు, ఉపాధ్యక్షుడు టీ రమేశ్, కార్యదర్శి జే గణేశ్, మాల ప్రజా సంఘాల జేఏసీ వర్కింగ్ చైర్మన్ గోపోజు రమేశ్, గ్రేటర్ అధ్యక్షుడు బీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జీ కల్యాణ్, ప్రధాన కార్యదర్శి ఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.