హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (నమస్తే తెలంగాణ): స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు ఇప్పిస్తానంటూ అమాయకులను నమ్మించి రూ.కోట్లు దండుకుంటున్న ఘరానా నేరస్థుడు రోనక్ తన్న (35)ను హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. గోవాకు చెందిన నిందితుడి నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 6 సెల్ఫోన్లు, 6 సిమ్‌కార్డులు, 5 చెక్‌బుక్‌లు, 15 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకోవడంతోపాటు అతడి బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.20 లక్షలు ఫ్రీజ్ చేసినట్టు నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రోనక్ మాయమాటలను నమ్మి రూ.3.16 కోట్లు మోసపోయినట్టు హైదరాబాద్ మహిళ ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసినట్టు తెలిపారు. రోనక్‌కు సహకరించిన సుదిత్ గోన్సాల్వెస్, సనా మహ్మద్ ఖురేషీకి నోటీసులు జారీచేసినట్టు చెప్పారు.