హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కొత్తగా 2,769 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2026-27లో ఈ స్కూళ్లను తక్షణమే ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ సూచించారు. జిల్లాల్లో 2,240, కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలో 529 చొప్పున ప్రీ ప్రైమరీ స్కూళ్లు ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్‌లో 275, మేడ్చల్ మల్కాజిగిరిలో 145, భద్రాద్రి కొత్తగూడెం 118, నల్లగొండ 124, రంగారెడ్డిలో 132, సంగారెడ్డిలో 132, వికారాబాద్‌లో 104 చొప్పున ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించనున్నారు.
ఇప్పటికే గల ప్రాథమిక బడుల్లోనే వీటిని ప్రారంభిస్తారు. ప్రతి బడికీ రూ. లక్ష మంజూరుచేశారు. రాష్ట్రంలో 1,300పై చిలుకు స్కూళ్లల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించారు. తాజాగా 2,769 స్కూళ్లల్లో ప్రారంభించేందుకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేట్‌లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహిస్తుండగా, సర్కార్ బడుల్లో మాత్రం నాలుగేండ్లు నిండిన వారికి అడ్మిషన్లు కల్పిస్తున్నారు. అంటే ఒక్క యూకేజీ క్లాస్‌కే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. మరీ నర్సరీ, ఎల్కేజీ ఎక్కడ చదవాలన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో విద్యార్థులు నర్సరీ, ఎల్కేజీ కోసం ప్రైవేట్ స్కూళ్లల్లోనే చేరుతున్నారని ఉపాధ్యాయ సంఘాలంటున్నాయి. సర్కార్‌లోనూ నర్సరీ నుంచి ప్రారంభించాలని ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి డిమాండ్‌చేశారు.