Telangana | హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారుపైన, సీఎం కేసీఆర్ మీద రాష్ట్ర రైతాంగానికి అపార నమ్మకం ఉన్నది. అందుకే ఏటికేడు విద్యుత్తు కనెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రైతులపై తెలంగాణ సర్కారుకు ప్రేమ ఉన్నది.. అందుకే వారికి భరోసా కల్పిస్తూ ఏటా రూ.వేల కోట్లను ఖర్చు పెడుతున్నది. వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత విద్యుత్తును అందిస్తూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ రైతాంగానికి ఇబ్బందులు రాకుండా కడుపులో పెట్టుకొని చూసుకొంటున్నది. దీని ఫలితంగానే రాష్ట్రంలో గడిచిన తొమ్మిదేండ్లలో 8.6 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు పెరిగాయి. అంటే రోజుకు సగటున 262 వరకు కనెక్షన్లు తీసుకొంటున్నారు.. 24 గంటల విద్యుత్తుపై రాష్ట్ర రైతాంగానికి ఉన్న నమ్మకానికి ఈ గణాంకాలే నిదర్శనం.
తెలంగాణ వచ్చాక విద్యుత్తు కనెక్షన్ల పెరుగుదల కొనసాగుతున్నది. తెలంగాణ సర్కా రు ఇస్తున్న 24 గంటల ఉచిత కరెంట్‌పై పూర్తి విశ్వాసంతో ఉన్న అన్నదాతలు వ్యవసాయానికి జోరుగా విద్యుత్తు కనెక్షన్లు తీసుకొంటున్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు 19.03 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు ఉండగా.. 2023 జూలై 1 నాటికి ఈ సంఖ్య 27.63 లక్షలకు చేరింది. అంటే తొమ్మిదేండ్లలో అన్నదాతలు సుమారు 8.60 లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు తీసుకున్నారు. ఈ కనెక్షన్ల సంఖ్య రైతులపై సర్కారుకున్న చిత్తుశుద్ధిని తెలియజేస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్తును పూర్తి ఉచితంగా అందించాలనేది సీఎం కేసీఆర్ కల. అందుకు అనుగుణంగా కేసీఆర్ మార్గదర్శనంలో విద్యుత్తు సంస్థల అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది దాదాపు మూడున్నరేండ్లు కష్టపడ్డారు. రాష్ట్రం మొత్తం 24 గంటల విద్యుత్తును అందించేలా ట్రాన్స్మిషన్, డిస్కం వ్యవస్థలను బలోపేతం చేశారు. 2018 జనవరి ఒకటి నుంచి 24 గంటల విద్యుత్తును ప్రారంభించారు. 24 గంటల కరెంట్ ప్రారంభం తర్వాత రాష్ట్ర రైతాంగంలో ప్రభుత్వంపై, విద్యుత్తుపై నమ్మకం పెరిగింది. పర్యవసానంగా గణనీయంగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు తీసుకుంటూ.. బంగారు పంటలు పండిస్తున్నారు. 24 గంటల విద్యుత్తును ప్రారంభించి సుమారు ఐదున్నరేండ్లవుతున్నది. ఈ కాలంలో రైతులు కొత్తగా సుమారు 5 లక్షల విద్యుత్తు కనెక్షన్లను తీసుకొన్నారు. ఈ లెక్కన సగటున రోజుకు దాదాపు 248 వరకు కనెక్షన్లు తీసుకోవడం విశేషం.
రైతులకు ఎంత చేసినా తక్కువే అనే కోణంలో సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఆలోచిస్తున్నారు. అన్నదాతలకు లాభం కలిగించేలా నిర్ణయాలు తీసుకొంటున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు అసలు ఉందో లేదో అన్నంతలా ఉన్న విద్యుత్తును కేవలం ఆరు నెలల్లోనే ఒక ఒడ్డుకు చేర్చారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు విద్యుత్తును అందివ్వడంతోపాటు వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్తును అందించారు. రాష్ట్ర రైతాంగానికి పూర్తి భరోసా కల్పించారు. వ్యవసాయానికికూడా 24 గంటలపాటు పూర్తి ఉచితంగా విద్యుత్తును అందిస్తామని చెప్పడంతో.. రైతులు బీడు భూములను కూడా సాగులోకి తీసుకొచ్చారు. అందుకనుగుణంగా బోర్లు, బావుల వద్ద విద్యుత్తు కనెక్షన్లు తీసుకొన్నారు. గడిచిన తొమ్మిదేండ్లలో మొత్తం 8.60 లక్షల కనెక్షన్లు పెరిగాయంటే అది సీఎం కేసీఆర్ ఇచ్చిన భరోసా.. 24 గంటల కరెంటుపై రైతుల నమ్మకమేనని అర్థమవుతున్నది.