Aarogyasri | హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ పథకమే మేలైనదని మరోసారి తేటతెల్లం అయ్యింది. కేంద్రం తాజాగా లోక్సభలో ఇచ్చిన సమాధానమే ఇందుకు నిదర్శనం. ఆయుష్మాన్ భారత్కు కేంద్రం కేటాయిస్తున్న నిధులు, చేస్తున్న ఖర్చును వివరించాలంటూ ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దీని ప్రకారం 2022-23లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ పథకం కోసం రూ.6,048 కోట్లు ఖర్చు చేసింది.
దేశవ్యాప్తంగా 27.5 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతున్నదని పేర్కొన్నది. ఈ లెక్కన ఆ ఏడాది ఒక్కో కుటుంబానికి చేసిన ఖర్చు కేవలం రూ.219 మాత్రమే. 2023-24లో ఆయుష్మాన్ భారత్కు రూ.7,200 కోట్లు కేటాయించింది. అంటే ఒక్కో కుటుంబానికి ఆరోగ్య పథకం కోసం చేసిన కేటాయింపులు రూ.261 మాత్రమే. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా సగటున ఆరోగ్య శ్రీ కోసం రూ.650 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 61 లక్షల కుటుంబాలకు పూర్తిగా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా సేవలు అందుతున్నాయి. మరో 29 లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ అమలవుతున్నది. ఇందులో కూడా 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ ఉన్నది. ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి వరకు ఖర్చు చేస్తున్నదని గణాంకాలు చెప్తున్నాయి. దీనిని బట్టి ఆయుష్మాన్ భారత్తో పోల్చితే ఆరోగ్య శ్రీ పరిధి ఎక్కువని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యాధుల చికిత్సలకు అందించే ప్యాకేజీ సైతం ఆరోగ్యశ్రీలోనే మెరుగ్గా ఉన్నదని చెప్తున్నారు.