కొత్తగూడెం ప్రగతి మైదాన్, మే 7 : తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య బుధవారం జరిగిన భీకరపోరులో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లా కర్రెగుట్టల్లో జరుగుతున్న ఆపరేషన్ ‘కగార్’లో భాగంగా మావోయిస్టుల కోసం భద్రతా దళాలు 15 రోజులుగా వేట సాగిస్తున్నారు. మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 26 మంది మావోయిస్టులు మృతి చెందారని బస్తర్ రేంజ్ అధికారులు పేర్కొన్నారు.
మృతుల్లో ఓ అగ్రనాయకుడు సైతం ఉన్నట్టు సమాచారం. కేంద్ర బలగాలు డ్రోన్ కెమెరాల ఆధారంగా మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ముప్పేట దాడి చేసినట్టు తెలుస్తున్నది. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆయుధ, మందుగుండు, సామగ్రిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు ఏర్పర్చుకున్న ఆయుధ తయారీ కర్మాగారాలు, బంకర్లను సీజ్ చేశారు. మృతుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.