హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఆదివారం ఒకే రోజు 26 మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం గణితం, జువాలజీ, హిస్టరీ పేపర్లకు పరీక్షలు నిర్వహించగా ఫస్టియర్‌లో 17 మంది, సెకండియర్‌లో మరో తొమ్మిది మంది కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడ్డారు. ఒక్క సంగారెడ్డి జిల్లాలోనే 22 మంది డిబార్ అయ్యారు.
ఫస్టియర్‌లో 14 మంది, సెకండియర్‌లో 8 మంది చొప్పున కాపీయింగ్‌కు పాల్పడగా, వారిని డిబార్చేశారు. వరంగల్, సిద్దిపేటలో ఒకరు చొప్పున, మెదక్ జిల్లాల్లో ఇద్దరు చొప్పున మొత్తం నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు. ఫస్టియర్ పరీక్షలకు 8,176 మంది, సెకండియర్‌కు 3,049 మంది విద్యార్థులు గైర్హాజరైనట్టు అధికారులు తెలిపారు.