నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 13 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో మూడో రోజైన శనివారం కూడా డ్యామ్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి 4,38,947 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా సాగర్ రిజర్వాయర్ నుంచి 4,10,297 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది. 24 క్రస్ట్ గేట్లను 10 అడుగులు, 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 3,58,625 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.40 అడుగుల వద్ద (302.3940 టీఎంసీల) నీరు నిల్వ ఉన్నది. శ్రీశైల జలాశయానికి ఎగువ నుంచి 4,25,563 క్యూసెక్కుల వరద వస్తుండగా, 4,37,194 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైంది.
పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నీటిమట్టం 885 అడుగులకుగాను 884.30 అడుగులకు చేరింది. జూరాల ప్రాజెక్టుకు 2.56 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. కాగా కర్ణాటకలోని తుంగభద్ర జలాశయం 33 గేట్లు ఎత్తారు. ఇన్‌ఫ్లో 1,13,653 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,13,653 క్యూసెక్కులుగా ఉన్నది. మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 3,041.54 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. కాగా ఎగువ ప్రాంతాల నుంచి క్రమంగా ఇన్‌ఫ్లో తగ్గుతుండటంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను మూసివేసి గోదావరిలోకి నీటి విడుదలను నిలిపివేశారు.
లక్ష్మీ బరాజ్‌కు 11 లక్షల క్యూసెక్కులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ బరాజ్‌కు శనివారం 11,18,460 క్యూసెక్కులు వస్తున్నది. దీంతో బరాజ్ 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
కాళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక రెండో రోజు కూడా కొనసాగుతున్నది. ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు కలిసి పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు భారీగా వరద వస్తున్నది.