నల్లగొండ: నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 22 గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడిచిపెడుతున్నారు. సాగర్లోకి 2.53 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది. 2.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుకాగా ప్రస్తుతం 585.30 అడుగులుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ 312.50 టీఎంసీలు కాగా, ఇప్పుడు 298.30 టీఎంసీలుగా నమోదయింది. సాగర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టు పూర్తిగా నిండింది. జలాశయంలోకి 2.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 11 గేట్ల ద్వారా 2.30 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుతం 167.9 అడుగుల వద్ద ఉన్నది. 45.77 టీఎంసీలకుగాను 35.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.