చర్లపల్లి, ఏప్రిల్ 21: తమను నిండాముంచిందని ఓ ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం ఎదుట బాధిత రైతులు ధర్నాకు దిగారు. కుషాయిగూడ సుభాష్‌నగర్‌లోని కంపెనీ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శ్రీ సాయిరాం ఫైనాన్స్ కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపడంతో పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద భూములు కోల్పోయిన రైతులు సుమారు 2,500 మంది వరకు డిపాజిట్లు చేశారు. వారి సొమ్ము సుమారు రూ.250 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తున్నది.
తమ నుంచి కో ట్లాది రూపాయలను శ్రీ సాయిరాం ఫైనాన్స్ సంస్థ యజమాని ధనుంజయ గుప్తా తదితరులు కొల్లగొట్టారని రైతులు ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా నిర్వాసితులు పెద్ద ఎత్తున నినదాలు చేశారు. తమ సొమ్ము తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. ధనుంజయ గుప్తాతోపాటు బాధ్యులైన సాయిబాబా,బాలీశ్వర్, తుకారాం, నాగం బుచ్చిరెడ్డి, జానకీరామిరెడ్డి, శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బాధిత రైతులు కోరారు. మోసంచేసిన వారిని సంఘ బహిష్కరణ చేయాలని, బాధితులు, రైతులకు పౌరసమాజం అండగా నిలువాలని కోరారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా వారు ప్రకటించారు.