హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తేతెలంగాణ)/నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ డిగ్రీ, పీజీ కళాశాలల నిర్వాహకులు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంద్ పాటించారు. రెండో రోజూ కాలేజీలు మూత పడడంతో వేలాది మంది విద్యార్థులు ఆందోళన వ్యక్తంచేశారు. సిబ్బందికి వేతనాలు చెల్లించలేక, కళాశాల భవనాల అద్దెలు కట్టలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుక్కొంటున్నామని, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యార్థుల స్కాలర్షిప్లను ప్రభుత్వం వెంటనే డిమాండ్ చేయాలని నిర్వాహకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా రెండోరోజూ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలు బంద్ పాటించాయి. ఎంజీయూ పరిధిలో మొత్తం 76 కాలేజీలు నిరసనలో పాల్గొన్నాయి. తెలంగాణ అఫిలియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీపీఎంఏ) ఆధ్వర్యంలో ఆందోళన సాగిస్తున్నాయి. పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలో పైవేట్ డిగ్రీ కళాశాలలకు సుమారు రూ.30కోట్ల నుంచి రూ.40 కోట్ల వరకు బోధన రుసుము బకాయిలు ఉన్నట్లు కళాశాలల యాజమాన్య సంఘం నాయకులు తెలిపారు. భువనగిరిలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు ర్యాలీ తీసి, వినాయక చౌరస్తాలో నిరసన తెలిపారు.
జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీఎంఏ) ప్రతినిధులు, అధ్యాపకులు శాంతియుత నిరసన ర్యాలీ తీశారు. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా టీపీడీఎంఏ జనగామ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌రెడ్డి మాట్లాడుతూ పెండింగ్ ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలల నిర్వహణ ఇబ్బందిగా మారిందని, ఇప్పటికే తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని వాపోయారు. అధ్యాపకుల జీతాలు, భవనాల అద్దెలు, విద్యుత్తు బిల్లులు, యూనివర్సిటీ రుసుములు చెల్లించలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో గత్యంతరం లేక కళాశాలలను నిరవధికంగా బంద్ చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
టోకెన్లు ఇచ్చి పదినెలలు
అసెంబ్లీ ఎన్నికల ముందు యేటా క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని, అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్, ఆచరణలో విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. గత బకాయిలే కాకుండా ఈ ఏడాది చెల్లించాల్సిన రూ.2500 కోట్లను కూడా విడుదల చేయలేదు. అధికారంలోకొచ్చిన తొలినెలలోనే రూ.400 కోట్లకు సంబంధించి ఆన్లైన్లో టోకెన్లు జారీ చేసి కాలేజీల యాజమాన్యాలకు సమాచారమిచ్చింది. దాదాపు పదినెలలు గడుస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో రీయింబర్స్మెంట్ జమ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో టోకెన్లు ఇచ్చిన మూడు, నాలుగు రోజుల్లోనే నిధులు విడుదలయ్యేవి. ఆ వెంటనే విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. కానీ కాంగ్రెస్ సర్కారు నిధుల విడుదలలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. లంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్య సంఘం పలుమార్లు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండాపోయింది. ఇప్పుడు యాజమాన్యాలు నిరవధిక బంద్ చేయడంతో విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంలో పడ్డాయి.
16.5 లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకం..
రాష్ట్రవ్యాప్తంగా సుమారు వెయ్యి జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, మరో వెయ్యిదాకా వృత్తివిద్యా కాలేజీలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ కాలేజీల్లో సుమారు 9.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. 2 లక్షల మంది అధ్యాపకులు, నాన్‌టీచింగ్ స్టాఫ్ పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్, ఫార్మా, బీఎడ్, డీఎడ్, ఎంబీఏ, ఎంసీఏ, నర్సింగ్ తదితర వృత్తివిద్యా కాలేజీల్లో సుమారు 3.5 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారు. లక్షమంది దాకా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో డిగ్రీ, పీజీ కాలేజీలకు సుమారు రూ.800కోట్లు, ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలకు దాదాపు రూ.1700 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాల్సి ఉన్నది. పదినెలలుగా నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం భవనాల అద్దె కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నామని కాలేజీల యజమానులు వాపోతున్నారు. మొత్తంగా 16లక్షల మంది భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఓయూ నుంచి పోరుబాట..
ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాల సంఘం సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా కాలేజీలను బంద్ చేయాలని నిర్ణయించారు. ఈ వేదికనుంచే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. లక్షలాదిమంది విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని లేఖలో కోరారు.
దశలవారీగానైనా విడుదల చేయాలి
గత ప్రభుత్వం కొంత ఆలస్యమైనా టోకెన్లు జారీ చేసిన వెంటనే రీయింబర్స్మెంట్ విడుదల చేసేది. ప్రస్తుత ప్రభుత్వం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది. రూ. 400 కోట్లకు టోకెన్లు ఇచ్చి పదినెలలు గడిచింది. నిధులు మాత్రం విడుదల చేయలేదు. అధ్యాపకులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక, బిల్డింగ్‌లకు రెంట్ కట్టలేక ఇబ్బంది పడుతున్నం. అప్పులు తెచ్చి కాలేజీలు నడుపుతున్నం. దిక్కుతోచని స్థితిలో కాలేజీలను బంద్‌చేయాలని నిర్ణయించినం. కనీసం ప్రభుత్వం ఒకేసారి కాకుండా దశల వారీగానైనా నిధులు విడుదల చేయాలి.
– సూర్యనారాయణరెడ్డి, టీడీపీఎంఏ ప్రెసిడెంట్