సూర్యాపేట టౌన్, ఆగస్టు 21: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగా మొదట వ్యవసాయంపై రైతాంగానికి విశ్వసనీయత కల్పించి అనుబంధరంగాల బలోపేతానికి ప్రణాళికలు రూపొందించారని చెప్పారు. నా యీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తు పథకాన్ని రాష్ట్రంలోనే మొదటిసారిగా శనివారం సూర్యాపేటలో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయీబ్రాహ్మణులు, రజకులకు విద్యుత్తు మీటర్లు, సామగ్రి, కనెక్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. చితికిపోయిన వ్యవస్థలకు చికి త్స చేయడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని భావించిన సీఎం కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు. కుల వృత్తులకు ఉచిత విద్యుత్తు అవసరమని ప్రతిపాదనలు రావడంతో ప్రభుత్వం మీద ఎంతటి భారంపడినా సీఎం కేసీఆర్ మంజూరు చేయడం గొప్ప విషయమని కొనియాడారు.