మియాపూర్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్న పండరి.. మంగళవారం ఉదయం డ్యూటీకి వచ్చిన సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లి అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దవాఖానకు తరలించగా.. హార్ట్‌అటాక్‌తో చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. అప్పటివరకూ తమతో బాధలు పంచుకున్న పండరి.. నిమిషాల్లో విగతజీవిగా మారడంతో తోటి ఉద్యోగులు షాక్‌కు గురయ్యారు. డ్యూటీ సమస్యలకు తోడు ఇంకేమి ఇబ్బందులు ఉన్నాయోనని తోటి కండక్టర్లు చర్చించుకున్నారు.
ఖమ్మం జిల్లా మధిర డిపోకు చెందిన కండక్టర్ అంబేద్కర్ సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌కు డ్యూటీ ఉందంటూ ఆందోళనగా, హడావిడిగా స్నానం చేయడానికి వెళ్లాడు. బాత్రూమ్లోనే అంబేద్కర్ కుప్పకూలిపోయాడు. 108 వాహనం వచ్చేలోపే ఆయన చనిపోయాడు. అతనికి గతంలోనే హృద్రోగ సమస్యలు ఉండగా.. ఉద్యోగ సంబంధమైన టెన్షన్, కుటుంబ సమస్యల కారణంగానే చనిపోయాడని తోటి కార్మికులు అంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అధిక పనిభారం, అధికారుల వేధింపుల కారణంగానే ఆరోగ్య సమస్యలు వస్తున్నట్టు తోటి కండక్టర్లు వాపోతున్నారు. సంస్థలో కొత్తగా కండక్టర్లను రిక్రూట్ చేయకపోవడంతో.. ఉన్నవారిపైనే అధిక పనిభారం పడుతున్నది. ఈ క్రమంలో గత రెండేండ్లలో టీజీఎస్ ఆర్టీసీకి చెందిన కండక్టర్లు సుమారు 25 మంది హార్ట్ అటాక్‌లు, మానసిక ఇబ్బందులతో మృత్యువాత పడ్డారని తోటి కార్మికులు చెప్తున్నారు.
విపరీతమైన పనిభారం..
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో డ్రైవర్లతో పాటు అధిక పనిభారాన్ని ఎదుర్కొనేవారు కండక్టర్లే. 50 సీట్లు ఉన్న బస్సుల్లో 100 నుంచి 150 మంది వరకూ ప్రయాణిస్తుంటే.. విపరీతమైన వర్క్‌లోడు.. పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకాన్ని పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌లకు పరిమితం చేయడంతో ఆ బస్సులో ఆక్యుపెన్సీ రేటు భారీగా పెరిగింది. మహిళల్లో 90శాతం మంది ఉచిత ప్రయాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల తప్పులకు కండక్టర్లనే బలి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కండక్టర్లు చేయని తప్పలకు సస్పెండ్ చేస్తున్నారని, టీటీఐల తనిఖీల్లో తమను దొంగలను చూసినట్టు చూస్తున్నారని కండక్టర్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ‘మహిళా ప్రయాణికులు ఎంతమంది ఎక్కారని కాదు? ఎంత డబ్బు తీసుకొస్తున్నావన్నదే ముఖ్యం..’ అంటూ వేధిస్తున్నారని, డబ్బులు రాకపోతే.. ‘ఎందుకు రావడం లేదు’ అని ప్రశ్నిస్తున్నారని వాపోతున్నారు. తెల్లవారుజామున 5.30కు డిపోలో రిపోర్టింగ్ చేస్తే.. రాత్రి 8.30కు డ్యూటీ దిగుతున్నామని, 15 గంటలు పనిచేయించుకుని ఒక గంటకు ఓటీ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తిండితినే తీరిక లేదు
తెల్లవారుజామున డ్యూటీ ఎక్కితే.. ప్రయాణికుల హడావిడితో తినే సమయం దొరకడం లేదని పలువురు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి ఉదయం తెచ్చుకున్న సద్ది.. సాయంత్రానికి పాచిపోతున్నదని వాపోతున్నారు. దీంతో బస్ డిపోల్లో దొరికే నాణ్యతలేని అల్పాహారాలు, భోజనాలు, సమోసాలు తిని ఆరోగ్యాలు పాడవుతున్నాయని అంటున్నారు. డిపో మేనేజర్లు ఇచ్చే టార్గెట్లకు, పెరిగిన వాహనాల ట్రాఫిక్‌తో టైమ్‌కి లంచ్ తినలేకపోతున్నామని చెప్తున్నారు. ఏ వ్యక్తికైనా 8 గంటలు డ్యూటీ చేస్తేనే ఆరోగ్యం బాగుంటుందని.. 15 నుంచి 18 గంటలు నిరంతరాయంగా డ్యూటీ చేస్తే ఇట్లాంటి హార్ట్స్ట్రోక్లే వస్తాయని అంటున్నారు. సమయానికి తినకపోవడం వల్ల బీపీలు, షుగర్లు, అల్సర్లతో హార్ట్అటాక్లు, గంటల తరబడి సీట్లో కూర్చోవడం వల్ల పైల్స్ వస్తున్నాయని చెప్తున్నారు. ఇక టీటీఐలు కూడా రోజూ తమ టార్గెట్లు రీచ్ అయ్యేందుకు.. చిన్నచిన్న కారణాలకే కండక్టర్లను సస్పెండ్ చేయడం, అక్రమంగా కేసులు పెట్టడం వంటివి చేస్తున్నారని వాపోతున్నారు.
శవాల ముందు సెల్ఫీలా!
కుటుంబసభ్యుల కోసం ఎప్పుడైనా సెలవులు కావాలని అడిగితే డిపో మేనేజర్ల నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని అంటున్నారు. బంధువులు చనిపోతే సెలవు ఇచ్చేందుకు శవం దగ్గరకు వెళ్లి సెల్ఫీ పెట్టాలని ఆదేశాలివ్వడం మరీ దారుణమని అంటున్నారు. ఒక్కోసారి విధులకు ఉదయం 5 గంటలకు డిపోకు చేరుకున్నా.. డ్రైవర్ రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన సూపర్వైజర్లు బలవంతంగా సెలవులు పెట్టించి పంపుతున్న ఉదంతాలు కోకొల్లలుగా ఉన్నాయని అంటున్నారు. ఓవైపు అవసరానికి సెలవులు ఇవ్వక.. మరోవైపు బలవంతంగా సెలవులు పెట్టిస్తున్నారని మండిపడుతున్నారు.
జీతాలు పెరగక ఇబ్బందులు..
15 ఏండ్లుగా డ్యూటీలు చేస్తున్నా కండక్టర్ల జీతాలు నెలకు రూ.45 వేల లోపునే ఉన్నాయని వాపోతున్నారు. ఫిట్మెంట్ 21 శాతం పెంచినట్టే పెంచి.. హెచ్ఆర్ఏ ఐదు శాతం తగ్గించారని చెబుతున్నారు. తమతో పాటు ట్రాన్స్‌కో వంటి విభాగాల్లో రిక్రూట్ అయిన లైన్మెన్లు ఇప్పుడు సుమారు లక్ష వరకూ జీతాలు తీసుకుంటున్నారని, తమ బతుకులు ఆగం అయ్యాయని వాపోతున్నారు. ఆబ్సెంట్ అయితే.. చార్జీషీటు ఇచ్చి.. ఇంక్రిమెంట్లలో కోతలు విధిస్తున్నారని చెబుతున్నారు. తమను మానసికంగా క్షోభ పెడుతున్నారని, కండకర్ట్ జీవితం కత్తిమీద సాములా మారిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.