Chattishgarh | కొత్తగూడెం ప్రగతి మైదాన్, 21 మే : ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో రక్తపుటేర్లు పారాయి..! భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య భీకర పోరు జరుగుతోంది. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 28 మంది మావోయిస్టులు నేలకొరిగినట్లుగా సమాచారం..!
వివరాల్లోకి వెళితే.. చత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ – నారాయణపూర్ జిల్లాల మధ్య గల మాడ్ డివిజన్ పరిధిలోని అబూజ్మాడ్ అడవుల్లో భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం వారికి మావోయిస్టులు తారసపడి జవాన్లపై కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ ఎదురు కాల్పుల్లో 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎదురు కాల్పులు జరుగుతున్నట్లుగా నారాయణపూర్ జిల్లా ఎస్పీ ప్రభాత్ కుమార్ స్పష్టం చేశారు.
స్వల్ప విరామం తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో పోలీస్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. మావోయిస్టులు గత మూడు నెలలుగా శాంతి చర్చలకు కాల్పుల విరమణ కావాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి లేఖలు రాస్తున్నప్పటికీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ఎదురు కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.