నార్కట్పల్లి, ఫిబ్రవరి 9 : ట్రావెల్ బస్సు లో రూ.25 లక్షలు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఓ ప్రయాణికుడు బస్సు దిగి టిఫిన్ చేసి వచ్చేలోగా నగదు ఉన్న బ్యాగును గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్లకు చెందిన వ్యాపారి వెంకటేశ్ రూ. 25 లక్షల నగదు తీసుకొని చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లడానికి ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఎక్కాడు.
నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి శివారులోని పూజిత హోటల్ వద్దకు రాగానే వెంకటేశ్ తనతో తీసుకువచ్చిన నగదు ఉన్న బ్యాగును అక్కడే పెట్టి బస్సు దిగి టిఫిన్ చేయడం కోసం వెళ్లాడు. తిరిగి వచ్చేలోగా నగదు ఉన్న బ్యాగు కనిపించలేదు. వెంటనే బాధితుడు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి సీఐ నాగరాజు, ఎస్సై క్రాంతికుమార్ సందర్శించి సీసీ కెమెరాలను పరిశీలించారు. బస్సు నుంచి నగదు ఉన్న బ్యాగును గుర్తుతెలియని ఓ వ్యక్తి చోరీ చేసినట్టు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.