Telangana | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ ఆనవాళ్లు కనిపించకుండా చేస్తామని పదే పదే చెప్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు అన్నంత పనికి ఒడిగడుతున్నది. ఆఖరుకు విద్యార్థులకిచ్చిన పాఠ్యపుస్తకాల్లోనూ కేసీఆర్ పేరు లేకుండా చేస్తున్నది. పుస్తకాలను వెనక్కి తీసుకొని మరీ పేర్లు తొలగించే తంతును చేపట్టింది. రాష్ట్రంలోని విద్యార్థులకు అందజేసిన పాఠ్యపుస్తకాల్లో ముద్రితమైన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను తొలగించాలని సర్కారు నిర్ణయించింది.
ఈ పేర్లున్న పేజీపై మరో పేజీని అతికించి ఇవ్వాలని ఆదేశాలిచ్చింది. గమ్ స్టిక్కర్లు ఉన్న పేజీని ఆ పేజీపై అతికించనున్నట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. గతంలో ఇలాగే పొరపాటు జరిగినప్పుడు పేజీని అతికించామని, ఇప్పుడు అలాగే చేయనున్నట్టు ఆయా వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతుల్లోని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేసిన విషయం తెలిసిందే. దాదాపు ఈ పుస్తకాల సంఖ్య 25లక్షల వరకు ఉంటుంది.
ఈ పుస్తకాల్లోని ముందుమాటలో కేసీఆర్ సహామాజీ మంత్రుల పేర్లను ప్రస్తావించారు. ఈ విషయం సోషల్‌మీడియాలో రావడంతో ఏదో తప్ప జరిగిందన్నట్టుగా పాఠశాల విద్యాశాఖ ఆగమేఘాల మీద ఆయా పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. అన్ని పాఠ్యపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది.
పుస్తకాలను ఎమ్మార్సీలో అందజేయాలని, ఎంఈవోలు వాటిని జిల్లా పుస్తకాల గోడౌన్లో వాపస్ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నది. ఇది అత్యంత ముఖ్యమైన అంశమని ప్రస్తావించింది. కొన్ని ప్రాంతాల్లో ఆయా పేజీని చింపివేయాలని మంగళవారం మౌఖిక ఆదేశాలిచ్చారు. ఇదే పేజీ వెనక వందేమాతరం, జనగణమనలుండటం, వాటిని అవమానం జరుగుతుందన్న అభ్యంతరాలు టీచర్ల నుంచి రావడంతో ఆఖరుకు పేజీని అతికించాలని నిర్ణయించారు.