హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): ‘మింగ మెతుకు లేదు.. మీసానికి సంపెంగ నూనె’ అన్నట్లుంది రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) సర్కారు తీరు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సొంత డబ్బా కొట్టుకునేందుకు ఆరాట పడుతున్నది. గుంతల రోడ్లపై ప్రమాదాలు జరిగి పెద్ద ఎత్తున జనం చనిపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం… విజయోత్సవాల ప్రచారానికి మాత్రం ఏకంగా రూ.25 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసింది.
కాంగ్రెస్ సర్కారు ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ పేరుతో గత ఏడాది నవంబర్ 14 నుంచి డిసెంబర్ 7వ తేదీవరకు వేడుకలు నిర్వహించిన విషయం విదితమే. ఈ ఉత్సవాల విధివిధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం గత ఏడాది నవంబర్ 8న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా ఓ క్యాబినెట్ సబ్‌కమిటీని నియమించింది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క సభ్యులుగా, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, కే కేశవరావు ప్రత్యేక ఆహ్వానితులుగా, సాంస్కృతికశాఖ ముఖ్యకార్యదర్శిని కన్వీనర్‌గా నియమించారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఆయా రంగాల్లో ప్రభుత్వం సాధించిన విజయాల పేరుతో పెద్దఎత్తున మీడియా ప్రకటనలు ఇచ్చారు. వార్తా పత్రికలు, న్యూస్ చానళ్లు, ఔట్‌డోర్ హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఇతరత్రా పబ్లిసిటీ యాడ్స్ కోసం రూ. 24,82,15,070 ఖర్చుచేశారు. విజయోత్సవాల ప్రచారం కోసం మీడియా ప్రకటనలకు ప్రభుత్వం చేసిన ఖర్చు వివరాలు వెల్లడించాలని కోరుతూ న్యాయవాది మామిడి వేణుమాధవ్ సమాచార హక్కు చట్టం కింద కోరగా, సమాచార శాఖ వివరాలు వెల్లడించింది.
ఓ వైపు రాష్ట్రం దివాలా తీసిందని, ఏ పని చేద్దామన్నా నిధులు లేవని, అప్పు కూడా పు ట్టడంలేదని పదేపదే ముఖ్యమంత్రే స్వయంగా చెప్తున్నప్పటికీ, ప్రచార ఆర్భాటానికి మాత్రం దాదాపు పాతిక కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడం విమర్శలకు తావిస్తున్నది. రాష్ట్రంలో వర్షాలకు రోడ్లు కొట్టుకుపోతున్నా నిధుల సమస్యను కారణంగా చూపుతూ కనీస మరమ్మతులు కూడా చేయించడంలేదు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 20 లక్షల ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటివరకు నిర్మాణంలో ఉన్న ఇండ్లు కేవలం 2.25 లక్షలు మాత్రమే. ఇక ఉద్యోగుల సమస్యలైతే చెప్పాల్సిన పనిలేదు.
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ను కూడా సకాలంలో ఇవ్వకుండా వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్నారు. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ఎప్పుడో గాలికొదిలేశారు. ప్రజా సంక్షేమం, ప్రజల కనీస అవసరాలను నెరవేర్చేందుకు అడ్డుగా ఉన్న నిధుల స మస్య.. ప్రచార ఆర్భాటానికి ఎందుకు లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన సొమ్మును ప్రజల అవసరాలకు కాకుండా ప్రభుత్వ ప్రచారానికి ఖర్చు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.