ఖిలా వరంగల్/కరీమాబాద్, జూన్ 22 : మామునూర్ విమానాశ్రయ పునరుద్ధరణ చర్యల జాప్యంతో బాధిత రైతు గుండెల్లో ‘విమానం’మోత మోగుతున్నది. మామునూరు విమానాశ్రయాన్ని తామే పునరుద్ధరిస్తున్నామని, ఇది తమ ఘనతేనని గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ సర్కార్ భూసేకరణ లాంఛనాలు పూర్తిచేయకుండానే పంట లేసుకోవద్దని రైతులకు హుకూం జారీ చేసింది. దీంతో ‘అమ్మ పెట్టదూ.. అడుక్కోనివ్వదు’ అన్నట్టు సర్కార్ వ్యవహరిస్తున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వం డబ్బులు చెల్లించాకే భూములు ఇస్తామని, చిల్లిగవ్వ చెల్లించకుండా పంటలు వేసుకోవద్దంటే ఎలా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి, అభ్యంతరాలు చెప్పేందుకు నిర్దేశిత గడువు ఇచ్చి, ధరపై సంప్రదింపుల ప్రక్రియ పూర్తి అయిందంటేనే భూసేకరణ చట్టప్రకారం సదరు భూములు ప్రభుత్వ భూములుగా పరిగణించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఆ ప్రక్రియలో భాగంగానే రైతులకు పంటలేసుకోవద్దని చెప్తున్నామని వాదిస్తున్నారు.
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం గాడిపెల్లి రెవెన్యూ పరిధిలోని గాడిపెల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లికి చెందిన 200 మంది రైతులకు సంబంధించిన 245 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తున్నది. జిల్లా యంత్రాంగానికి, రైతులకు మధ్య జరిగిన సంప్రదింపుల్లో ఎకరానికి రూ.1.20 కోట్ల ధర నిర్ణయమైంది. ఈ క్రమంలో ఈ వానకాలం నుంచి రైతులకు సంబంధించిన భూముల్లో పంటలు వేసుకోవద్దని అధికారులు ప్రకటించగా వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు ఒప్పుకున్న ప్రకారం డబ్బులు చెల్లించకుండా పంటలు వేసుకోవద్దని చెప్పడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పరిహారం చెల్లిస్తేనే భూములను వదులుకుంటామని, అటు పరిహారం ఇవ్వకుండా.. ఇటు పంటలేసుకోకుండా భూములు ఇవ్వమంటే ఎట్టిపరిస్థితుల్లో ఇచ్చేది లేదని రైతులు తెగేసి చెప్తున్నారు.
మాకు ఇస్తానని చెప్పిన మొత్తం డబ్బులు ఇచ్చినంకనే భూములను వదిలిపెడ్తం. అప్పటిదాకా సాగుచేసుకుంటం. నాకు 3.8 ఎకరాల భూమి ఉంది. సర్వే చేసిన తర్వాత కలెక్టర్ ఎకరానికి రూ.1.20 కోట్లు ఇస్తామన్నరు. ఇప్పటి వరకు అగ్రిమెంటు లేదు, డిపాజిట్ చేయలేదు, ఆధార్‌కార్డు, పాస్ బుక్ జిరాక్స్ కూడా తీసుకోకుండా పంటలేసుకోవద్దని ఎట్లా చెప్తరు?
– తోట రాజేంద్రప్రసాద్, రైతు, గాడిపల్లి
పావులో పరకో ఇయ్యకుండా భూమి మీదికి రావద్దంటే ఎట్ల? పైసలియ్యంది భూమెందుకు ఇస్తం? డబ్బులు ఇచ్చిన తర్వాతనే భూములు ఖాళీ చేస్తం. పరిహారం ఇవ్వరు.. పంటలు వేయద్దంటే ఇల్లు ఎట్ల గడుస్తది ? భూములు పోతున్నమాకు ఒప్పుకున్న పరిహారం, ఇండ్ల జాగ, పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యాలి. ఇప్పుడేం ఇయ్యకుండా పంటలేసుకోవద్దంటే ఎట్లా బతకాలె?
– కాయిత రేణుక, రైతు, గాడిపల్లి
ప్రభుత్వం మా భూములకు పైసలిచ్చి కొన్నప్పుడే మాకు భూమిమ్మీద హక్కు ఉండదు. ఏ లెక్కన పంటలు వేయద్దని చెప్తరు. వ్యవసాయం చేయకుండా, పరిహారం ఇయ్యకుండా మేమెట్ల బతకాలె? మాకున్న ఎకరం 20 గుంటల భూమిలో మొన్ననే బోరు వేసినం. ఆ సంబురం కూడా లేకుండా చేస్తున్నరు.
– జంగా రమ, రైతు గాడిపల్లి