Sangareddy | కల్హేర్, ఆగస్టు 12: కలుషిత ఆహారం తిని 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన సోమవారం సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. బీబీపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 114 మంది విద్యార్థులకు 92 మంది విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేశారు. తిన్న తర్వాత 2, 3 గంటల ప్రాంతంలో విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వండిన కూర వాసన వచ్చిందని కొందరు విద్యార్థులు తెలిపారు. దీంతో ఆందోళన చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు 108 వాహనానికి సమాచారం ఇచ్చి అస్వస్థతకు గురైన 24 మంది విద్యార్థులను నారాయణఖేడ్ సర్కార్ దవాఖానకు తరలించారు.
దవాఖానలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎంఈవో శంకర్ తెలిపారు. బీబీపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్ నర్సింగ్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించకుండానే విద్యార్థులకు వడ్డించారు. భోజనంలో వడ్డించిన గుడ్లు తినడంతో 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని, అందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.