Telangana | వికారాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): ‘పదేండ్ల కింద ఉన్న తెలంగాణకు నేటి తెలంగాణకు చాలా తేడా ఉన్నది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదేండ్లలోనే తెలంగాణ.. దేశం ఆశ్చర్యపోయేలా ప్రగతి పరుగులు పెడుతున్నది. సమైక్యపాలనలో పవర్ హాలిడేలతో నిర్వీర్యం చెందే దశలోఉన్న పరిశ్రమలకు తెలంగాణ సర్కారు 24 గంటల కరెంట్ అందించి జీవం పోసింది.’ అని యువ పారిశ్రామికవేత్త, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిక్కీ ప్రెసిడెంట్ చైతన్య పేర్కొన్నారు. ఈ తొమ్మిదేండ్ల కాలంలో తెలంగాణ విద్యుత్తు విజయం, కరెంట్ కోతలతో నాడు పరిశ్రమలు ఎదుర్కొన్న సంక్షోభాన్ని ఆయన ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంట్‌తో పారిశ్రామిక రంగం ఎలా ప్రగతి పరుగులు పెడుతున్నదో ఆయన మాటల్లోనే తెలుసుకొందాం..
ఆరు నెలల్లోనే కరెంట్ సమస్య పరిష్కారం
తెలంగాణ రాకముందు పరిశ్రమలకు పవర్ హాలిడేస్ ప్రకటించిన దయనీయ పరిస్థితులుండేవి. పరిశ్రమలతోపాటు ఇండ్లకు కూడా కరెంట్ కోతలే. విద్యుత్తు కోతలతో వారానికి రెండు రోజులే పరిశ్రమలు నడిచిన పరిస్థితి. పరిశ్రమలు నడవాలంటే నిరంతర విద్యుత్తు అవసరం. సమైక్య పాలనలో నాలుగైదు గంటలు మాత్రమే విద్యుత్తు ఇచ్చేవారు. ఒక షిఫ్ట్ పనులు మాత్రమే నడిచేవి. దీంతో చాలా మంది కార్మికులు జీవనోపాధి కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకొన్నాక సీఎం కేసీఆర్ ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీ ప్రకారం పరిశ్రమలతోపాటు ఇండ్లు, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చారు. గతంలో కరెంట్ రావడం వార్త అయితే, ఇప్పుడు కరెంట్ పోవడం వార్తలా మారింది. తొమ్మిదేండ్లుగా చిన్నతరహా పరిశ్రమల నుంచి పెద్ద పరిశ్రమల వరకు నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నారు.
టీఎస్-ఐపాస్, టీ-ప్రైడ్, టీ-ఐడియా కార్యక్రమాలతో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. సింగిల్ విండో పద్ధ్దతిలో పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్-ఐపాస్ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువచ్చి 15 రోజుల్లోనే అనుమతులిస్తున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం సాధ్యం కాదని గుర్తించి, ఉద్యోగాలు ఇచ్చేలా ఎదిగేందుకు టీ-ప్రైడ్ తీసుకువచ్చి సబ్సిడీని అందిస్తూ మాలాంటి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ దగ్గరికి పోయి రుణాల కోసం ఎదురుచూడకుండా సుస్థిర జీవనోపాధి కల్పించి, ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఎదిగేందుకు నూతన కార్యక్రమాలను తీసుకువస్తున్నారు. అన్ని రంగాలు పూర్తిగా నిర్వీర్యం అవుతున్న సమయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆలోచనలతో దేశమంతా తెలంగాణవైపు చూస్తున్నది. పరిశ్రమలతోపాటు వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో తెలంగాణ దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రగతి సాధిస్తున్నది.
కేసీఆర్ పాలనలో సబ్బండ వర్ణాల సంక్షేమం
అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని విధంగా పథకాలను తీసుకువచ్చి అమలు చేస్తున్నారు. పుట్టిన పాప నుంచి వృద్ధులవరకూ ఏదో ఒక పథకంతో ఆదుకొంటున్నారు. పార్టీలకతీతంగా కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నేతలు, కార్యకర్తలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. 24 గంటల కరెంటు, రోడ్లు, విద్య, వైద్యం, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్స్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, దళితబంధు, రైతుబంధు, రైతుబీమాలాంటి దేశంలో ఎక్కడాలేని పథకాలను ఇక్కడ అమలు చేస్తున్నారు. గతంలో బషీరాబాద్ మండలం ఎక్మయి గ్రామానికి చెందిన రైతు హైదరాబాద్‌లోని రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి పోయే వరకు పొద్దుపోయేది. కానీ ప్రస్తుతం కొత్త జిల్లా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను దగ్గరకు తీసుకురావడంతో ప్రజల కష్టాలు తప్పినయ్. కేసీఆర్ పాలనతో వలసలు పోయే పరిస్థితి నుంచి తెలంగాణకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అన్ని స్కాములే ఉంటే.. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమానికి స్కీములు అమలు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు, రైతులు, సామాన్య ప్రజలందరూ మరోసారి కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చైతన్య తెలిపారు.
ఇతర రాష్ర్టాల్లో 24 గంటల కరెంట్ ముచ్చటే లేదు!
మనకు పది కిలోమీటర్ల పక్కనున్న కర్ణాటకతోపాటు ఏ రాష్ట్రంలో కూడా ఏ రంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యుత్తు కోతలతో ప్రజలు, రైతులు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో అయితే పరిశ్రమలకు నిత్యం పవర్ కట్లే. ఇండ్లకు కూడా 1కేవీ, 2కేవీ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలకులకు చేతనైత లేదు. ఇక్కడ దమ్మున్న నాయకుడు కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నారు కాబట్టి నిరంతర విద్యుత్తుతో కరెంట్ ఆధారిత పరిశ్రమలు, వ్యాపారాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి.
నాటి రోజులు తలుచుకుంటే దుఃఖం వస్తది
ఒక్కటి కాదు రెండు కాదు నేను నల భై ఏండ్ల నుంచి సాగు చేస్తున్నా. అంతకంటే ముందు మా నాన్నతో కలిసి పొలం పనులకు వెళ్లేవాడిని. 1980 తరువాత నేనే సొంతంగా సాగు ప్రారంభించా. చిన్నతనంలోనే నేను మోటతోలి పొలం పండించా. అయ్యాల రెం డు ఎకరాలు నీరు పారిస్తే అదే గొప్ప. బావిలో ఉన్న నీళ్లను మోటతో తోడితే కాని పైకి వచ్చేవి కావు. ఆ తర్వాత కొన్నేండ్లకు మా ప్రాంతానికి సాగర్ నీళ్లు రావడం మొదలైంది. దీంతో మా కష్టాలు పోయినయి. నాడు కాలువ నీళ్లు వస్తేనే పంట పండేంది. ఆ తర్వాత కొన్నేండ్లకు కరువు వచ్చింది. వర్షాలు లేవు. కాలువలు ఎండిపోయాయి. సాగు కష్టమయింది. ఇక తప్పదు అనుకుని బావుల్లో పూడికలు తీయించినం. అయినా ఏం లాభం? కరెంట్ కోతలు ఉండేవి. ఎప్పుడు కరెంట్ వస్తదో ఎప్పు డు పోతదో తెలిసేది కాదు. అయినా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. రాత్రి ళ్లు పంటకు నీళ్లు పెట్టేందుకు పొలాల్లోనే నిద్రపోయేటోళ్లం. కొద్దిరోజులు జనరేటర్లు పెట్టినం. డీజిల్ ఖర్చు విపరీతంగా పెరిగి పెట్టుబడి భారమయ్యేది. ఎగుడు దిగుడు విద్యుత్తు సరఫరాతో ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేవి.
ఇక సాగు కష్టమని నిర్ణయించుకున్నాం. నాడు ఎంతోమంది వేరే ప్రాంతాలకు బతకుదెరువుకు పోయారు. నాటి రోజు లు గుర్తుకు వస్తే దుఃఖం వస్తది. కానీ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం మొదలైందో మాకు ఆశలు వచ్చినయి. రాష్ట్రం వచ్చినంక రైతులకు మంచి చేస్తా అని కేసీఆర్ చెప్పిన మాటలు తలకెక్కినయి. తెలంగాణ వచ్చినంక అన్నట్లే రైతుల కోసం పథకాలు అమలు చేస్తున్నరు. పంటలకు ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్తు అందుతున్నది. నా తొమ్మిదెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్న. డెయిరీ పాం పెట్టిన. సేంద్రియ ఎరువు లు తయారు చేయిస్తున్న. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకున్న. తెలంగాణ రాకపోతే, కేసీఆర్ లేకపోతే పొలాలు ఎడారిగా మారేవి. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే 3 గంటల కరెంట్ ఇస్తం అంటున్నరు. వాళ్లు 36 గంటలు కరెంట్ ఇస్తామన్నా ప్రజలు నమ్మొద్దు.
– అనుమోలు రామిరెడ్డి, సేంద్రియ సాగు రైతు, రైతు నేస్తం అవార్డు గ్రహీత, ఖమ్మం రూరల్ మండలం, ఖమ్మం జిల్లా