Rain Alert | హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టినవారు వెంటనే రద్దు చేసుకొని విధుల్లో నిమగ్నం కావాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలపై సీనియర్ మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో సీఎం రివ్యూ చేశారు. అనంతరం సీఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్తు, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్‌శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంవోకు పంపాలని ఆదేశించారు. భారీ వర్షాలతో వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకోవాలని ఆదేశించారు. నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా లిఫ్ట్‌చేసి రిజర్వాయర్లు నింపాలని ఆదేశించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అలర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్‌రెడ్డి కోరారు.
వరద నష్టంపై ప్రధాని ఆరా
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ఫోన్ చేసి వరద నష్టంపై ఆరా తీశారు. ఖమ్మం జిల్లాలో ఎకువ నష్టం సంభవించిందని తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సాయం అందిస్తామమని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా సీఎం రేవంత్‌రెడ్డితో మాట్లాడి వరద పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
గోదావరి తీరం వెంబడి అప్రమత్తం
ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ నుంచి కలెక్టర్లు, రాష్ట్ర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సచివాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, మున్సిపల్, వైద్య ఆరోగ్య, నీటి పారుదల, రెవెన్యూ, డిజాస్టర్ మేనేజ్మెంట్, జీహెచ్ఎంసీ, జలమండలి, ట్రాన్స్‌కో తదితరశాఖల అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో శనివారం అర్ధరాత్రి నుంచి పరిస్థితిని స్వయంగా తాను పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. జంట నగరాల్లో వరదల వల్ల ఏర్పడే విపత్తును ఎదురోవడానికి హైడ్రాను సన్నద్ధం చేశామని వెల్లడించారు.
అంతరాయంలేని విద్యుత్తు అందించండి
భారీ వర్షాల నేపథ్యంలో వినియోగదారులకు అంతరాయం తలెత్తకుండా విద్యుత్తునందించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆదివారం మధిర తహసీల్దార్ కార్యాలయం నుంచి టీజీఎన్పీడీసీఎల్ సంస్థ ఎస్ఈలు, డీఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నీట మునిగిన సబ్స్టేషన్ల వివరాలు తెలుసుకుని, విద్యుత్తు పునరుద్ధరణకు కలెక్టర్లు, పోలీసు, రెవెన్యూశాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
45 పునరావాస కేంద్రాలు : పొంగులేటి
రాష్ట్రంలో 45 పునరావాస కేంద్రాలను తెరచి, 2,500 మందికిపైగా తరలించామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 85 చెరువులు, కుంటలు, కాలువలకు గండ్లు పడ్డాయని ప్రాథమిక సమాచారం అందిందని చెప్పారు. వరద తీవ్రత అధికంగా ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు సహాయసహకారాలు అందిస్తున్నామని చెప్పారు. తన నియోజకవర్గమైన పాలేరులోని కూసుమంచి మండలం నాయకన్‌గూడెంకు చెందిన ఇటుకలపని చేసుకొనే యాకూబ్, ఆయన భార్య సైదాబీ వరదల్లో కొట్టుకోపోవడంపై మంత్రి శ్రీనివాసరెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్ని ఉన్నా కూడా వాతావరణం అనుకూలించక వారిని రక్షించుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశారు.
అదనంగా 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
భారీ వర్షాల నేపథ్యంలో అదనంగా తొమ్మిది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ర్టానికి రానున్నాయి. చెన్నై, వైజాగ్, అసోం నుంచి మూడు చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో కురుస్తున్న కుంభవృష్టి వానలు, వరదల తీవ్రతను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లడంతో తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపిస్తున్నట్టు చెప్పారు.
నేడు విద్యాసంస్థలకు సెలవు
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు తప్పనిసరిగా సెలవులివ్వాలని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఓయూతో పాటు మహత్మాగాంధీ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, జేఎన్టీయూ సోమవారం జరగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదావేశారు. మంగళవారం వర్షాలు తగ్గకపోతే, వాతావరణ పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.