National Highways | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు నిధుల కేటాయింపు విషయంలో మీనమేషాలు లెక్కించే కేంద్ర ప్రభు త్వం బాకా ఊదడంలో మాత్రం తనకు సాటి మరెవరూ లేరని నిరూపిస్తున్నది. ఇందుకు జాతీయ రాహదారుల అభివృద్ధి అంశమే నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గడిచిన 9 ఏండ్లలో రూ.1.25 లక్షల కోట్లు మంజూరు చేసినా, రూ.20 వేల కోట్ల పనులు మాత్రమే చేసింది. అంతేకాకుండా టోల్‌ట్యాక్స్ రూపంలో దాదాపు 9 వేల కోట్ల రూపాయలు వసూలు చేసింది. అది చాలదన్నట్టు రోడ్డు సెస్ కూడా వసూలు చేస్తున్నది. తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపే కేంద్రం.. రాష్ట్ర విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తున్నది. రాష్ట్రంలోని మరో 14 ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించి పనులు చేపట్టాలని ఆర్‌అండ్‌బీశాఖ పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది.
జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం ఖర్చు చేస్తున్నది శూన్యం కాగా, రాష్ట్రం నుంచి మాత్రం వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నది. రోడ్డు సెస్ పేరుతో పెట్రోలు, డీజిల్‌పై ప్రతీ లీటర్‌కు రూ. 20 నుంచి రూ. 30 చొప్పున వసూలు చేస్తున్నది. ఈ రకంగా గడిచిన 9 ఏండ్లలో తెలంగాణ నుంచి రూ.9వేల కోట్లు రాబట్టింది. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రం మాత్రం రూ. 1.25 లక్షల కోట్లు ఇచ్చినట్టు గొప్పలు చెప్పుకుంటుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.