హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి బయటపడిన తర్వాత రాష్ట్రంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్థిరంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 5 నెలల్లో ప్రతినెలా సగటున రూ.3,600 కోట్లు వసూలయ్యాయి. ఇవి గతేడాది ఇదే కాలంలో వచ్చిన వసూళ్ల కంటే 23% ఎక్కువ. ఈ ఏడాది నవంబర్లో అత్యధికంగా రూ.3,931 కోట్లు వసూలయ్యాయి. ఇవి గతేడాది నవంబర్లో వచ్చిన రూ.3,175 కోట్ల కంటే 24% అధికం. ఇదే సమయంలో జాతీయ సగటు వృద్ధి 19 శాతంగా నమోదైంది. ఇక నవంబర్ వసూళ్ల వృద్ధిలో తెలంగాణ దక్షిణాదిలో మూడో స్థానంలో నిలిచింది. 36% వృద్ధితో కేరళ, 30% వృద్ధితో కర్ణాటక తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.