హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అధికారులకు, పాలకపక్ష నేతలకు కాసులు కురిపిస్తున్నది. తన రెక్కల కష్టంతో కట్టుకొన్న ఇంటిని నిషేధ జాబితాలో చేర్చి, హక్కులు కాలరాసి.. ఇప్పుడు సర్కార్ బందిఖాన నుంచి విడిపించే పేరిట అధికారికంగా డబ్బు వసూలు కార్యక్రమం యథేచ్ఛగా కొనసాగుతున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ నగరవ్యాప్తంగా నిషేధిత జాబితా మాటున ఈ తరహా లావాదేవీలు సాగుతుండగా, అడ్డగోలు రిజిస్ట్రేషన్లతో అటు అధికారులతోపాటు, పాలక పక్ష నేతలు జేబులు నింపుకొంటున్నారనే ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉప్పల్ పరిధిలో నిషేధిత జాబితాలో ఉన్న ఫీర్జాదిగూడ భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన అంశం వెలుగు చూడటంతో ఆ అక్రమాలకు బలం చేకూరుతున్నది.
తమ భూములు, ఆస్తులను నిషేధిత జాబితా కోరల్లో ఇరికించి కాంగ్రెస్ సర్కార్ వేధింపులకు గురిచేస్తున్నదని బాధిత ప్రజానీకం గగ్గోలు పెడుతున్నది. నిబంధనల ప్రకారమే నిషేధిత జాబితాను సిద్ధం చేశామని చెప్పుకొంటున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఆ జాబితాను ఆదాయ వనరుగా మార్చుకున్నట్టుగా కనిపిస్తున్నది. నిషేధిత జాబితా నుంచి ఆస్తులను కాపాడుకొనేందుకు సామాన్యులు తలకు మించిన భారాన్ని మోస్తున్నారు. దశాబ్దాల కాలంగా తమ ఆస్తులుగా ప్రజలు చెప్పుకొన్న స్థిరాస్తులను నిషేధించిన ప్రభుత్వం.. ఇప్పుడు వాటితో జేబులు నింపుకొని లావాదేవీలను నిర్వహిస్తున్నది.
ప్రభుత్వ భూములకు కరువైన రక్షణ
రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ శాఖల మధ్య సమన్వయలోపంతో పుట్టిన ఈ నిషేధిత జాబితా సామాన్యుల పాలిట శాపంగా మారింది. సర్వే నంబర్లో ఎక్కడో ఒకచోట ప్రభుత్వ భూములుంటే, ఆ సర్వేనంబర్‌లోని మొత్తం భూమిని నిషేధించింది. నిజానికి రెవెన్యూ శాఖ ఆ భూములను వేరు చేసి, ప్రైవేట్ భూములకు విముక్తి కల్పించాలి. కానీ వాటిని విభజన చే యకుండా ఆ సర్వేనంబర్ మొత్తాన్ని నిషేధించడంతో, ప్రైవేట్ ఆస్తులు కూడా ప్రభుత్వ భూములుగా మారిపోయాయి. అధికార బలం, బడా నేతలతో కలిసి ప్రభుత్వ భూములను కూడా చెరబడుతున్న ఘటనలు ఇటీవల వెలుగు చూశాయి.
కాసులు దండుకోవడానికే 22ఏ
నిషేధిత భూములను రిజిస్ట్రేషన్లు చేస్తున్న వైనం ఇటీవల ఉప్పల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వెలుగుచూసింది. ఫీర్జాదిగూడలోని సర్వేనంబర్ 39, 43, 44లో భూములను ప్రభుత్వం నిషేధించింది. కానీ, ఇక్కడి అధికారులకు అవేవీ పట్టనట్టుగా దర్జాగా నిషేధిత జాబితా తమకు వర్తించదన్నట్టుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ముడుపులు ముట్టజెప్తే నిబంధనలతో సంబంధం లేకుండా రిజిస్ట్రేసన్లు జరుపుతున్నారని, ఈ వ్యవహారంలో జిల్లాస్థాయి అధికారి కూడా వాటాదారుడిగా ఉన్నారని కింది స్థాయి సిబ్బంది బాహాటంగా చెప్తున్నారు.
ఈ సర్వేనంబర్లలో ఇప్పటివరకు 40కిపైగా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తున్నది. ఒక్కో ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు రూ.2-3 లక్షలు చేతులు మారినట్టుగా సిబ్బంది ద్వారా తెలిసింది. ఈ వ్యవహారంపై ఆరా తీయడంతో రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీనిపై ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేయడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కేవలం కాసులు దండుకోవడానికే తీసుకొచ్చిన ఈ నిషేధిత జాబితా బడా నేతలు, అధికారులకు అక్రమ సంపాదనను తీసుకొచ్చే సాధనంగా మారిందని సామాన్యులు మండిపడుతున్నారు.