హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో వివిధ స్టేషన్ల నుంచి శబరిమలకు మరో 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టు శుక్రవారం అధికారులు తెలిపారు. నాందేడ్, సిర్పూర్-కాగజ్‌నగర్, హైదరాబాద్, కాచిగూడ నుంచి కొల్లం, కొట్టాయం స్టేషన్ల వరకు ఈ నెల 13 నుంచి జనవరి 26 వరకు ప్రత్యేక రైళ్లు నడుస్తాయన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 6(నమస్తే తెలంగాణ): రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను కేంద్ర ప్రభుత్వం పురస్కారంతో సత్కరించింది. ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రశంసా పురస్కారంతో శుక్రవారం ఆయనను సన్మానించారు. పీడీఎస్ ఆహార ధాన్యాల రవాణాలో రూట్ ఆప్టిమైజేషన్, జీపీఎస్‌ను అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడంలో చౌహాన్ కృషిని కేంద్రమంత్రి కొనియాడారు. ఈ విధానం వల్ల లబ్ధిదారులకు పారదర్శకతతో పంపిణీ చేయవచ్చని తెలిపారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలుచేయడానికి ఆమోదయోగ్యంగా ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.