హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది కృష్ణా నదిలో వరద రికార్డు స్థాయిలో పోటెత్తింది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రతోపాటు మన రాష్ట్రంలోని క్యాచ్మెంట్ ఏరియాలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తుండటమే ఇందుకు కారణం. కృష్ణా నది నుంచి 1990-91లో 1,250.19 టీఎంసీల జలాలు సముద్రంలో కలువగా.. ఈ ఏడాది ఆ రికార్డును తిరగరాస్తూ 1,386 టీఎంసీలు సముద్రానికి తరలిపోయాయి. దీంతో 35 ఏండ్ల క్రితం నాటి రికార్డు చెరిగిపోయింది. కృష్ణా నుంచి 1994-95లో 1,329.30 టీఎంసీలు, 1998-99లో 1,226.50 టీఎంసీలు, 2005-06లో 1,249.49 టీఎంసీలు, 2020-21లో 1,278.12 టీఎంసీలు, 2022-23లో 1,331.55 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ఆ రికార్డులన్నీ చెరిగిపోయి కొత్త రికార్డు నమోదైంది.
శ్రీశైలం ప్రాజెక్టు సైతం 41 ఏండ్ల రికార్డును తిరగరాసింది. 1984లో అత్యధికంగా ఈ ప్రాజెక్టు వద్ద 2,039.87 టీఎంసీల వరద నమోదవగా.. ఈ ఏడాది ఇప్పటికే 2,133 టీఎంసీల వరద ప్రవాహం నమోదైంది. ఇప్పటికీ ఎగువ నుంచి దాదాపు లక్ష క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతున్నది. ఈ ప్రవాహం వచ్చే నెల వరకు ఇలాగే కొనసాగవచ్చని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దాదాపు 30 దఫాలుగా శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేశారు. ప్రస్తుతం కూడా గేట్లను తెరచే ఉంచారు. కాగా, శ్రీశైలం వద్ద పోతిరెడ్డిపాడు, మల్యాల తదితర లిఫ్ట్‌ల ద్వారా ఏపీ ఇప్పటికే 200 టీఎంసీలకుపైగా మరోవైపు ఈ ఏడాది గోదావరి నుంచి సైతం ఇప్పటివరకు 3,905 టీఎంసీల జలాలు సముద్రానికి తరలివెళ్లాయి. 2022లో గోదావరి నుంచి అత్యధికంగా 4,210 టీఎంసీలు సముద్రంలో కలిశాయి.