హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన టీచర్ల శిక్షణకు రాష్ట్రంలోని 21వేలకుపైగా టీచర్లు గైర్హాజరయ్యారు. ఐదు రోజులపాటు నిర్వహించిన రెం డు విడతల శిక్షణకు వీరంతా గైర్హాజరయ్యారు. దీంతో పాఠశాల విద్యాశాఖ సీరియస్గా తీసుకుంది. గైర్హాజరైన టీచర్లకు సోమవారం నుంచి శిక్షణ ఇప్పిస్తున్నది. ఈనెల 30 వరకు ఈ శిక్షణ కొనసాగనున్నది. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ బడుల్లో మొత్తం 1,22,854 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఇందులో 1,16,084 టీచర్లకు శిక్షణ ఇవ్వాల్సి ఉంది. 866 కేంద్రాల్లో మే 13 నుంచి ఐదురోజులపాటు టీచర్లందరికి శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణకు 94, 794 మంది హాజరుకాగా, 21,290 మంది గైర్హాజరయ్యారు. మూడో విడతలో ఆయా టీచర్లకు శిక్షణ ఇస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు.
గురుకుల సొసైటీ కార్యదర్శికి టీచర్ల వినతి
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకులాల్లో డిప్యూటీ వార్డెన్ డ్యూటీలను ప్రతీ మూడు నెలలకు కేటాయించాలని సొసైటీ సెక్రటరీ రమణకుమార్కు తెలంగాణ గురుకుల విద్యాసంస్థల ఉద్యోగల సంక్షేమ సంఘం విజ్ఞప్తి చేసింది. సంఘం అధ్యక్షుడు కొక్కుల యాదయ్యతో కలిసి గురుకుల టీచర్లు సోమవారం సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు.