బుధవారం 03 జూన్ 2020
Telangana - May 16, 2020 , 14:57:35

కరోనా యుద్ధవీరులకు ఘనంగా సన్మానం

కరోనా యుద్ధవీరులకు ఘనంగా సన్మానం

పెద్దపల్లి : కరోనా వైరస్‌ నివారణ చర్యల్లో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను పుట్ట లింగమ్మ చారిటబుల్‌ ట్రస్ట్‌, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధు పాల్గొన్నారు. పోలీసులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సత్కరించారు మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పుట్ట మధు. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం రక్తదాన శిబిరం నిర్వహించారు. 


ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. కరోనా వైరస్‌ నియంత్రణకు పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. సీఎం కేసీఆర్‌ ముందు జాగ్రత్తల వల్లే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కువగా ఉందన్నారు. కరోనా నియంత్రణ కోసం సీఎం కేసీఆర్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తం కొరత ఉందని మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారని మంత్రి గుర్తు చేశారు. మంథనిలో కూడా 300ల మంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. 

కరోనా కష్ట కాలంలో కార్మికుల కష్టాలు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. వలస కార్మికులను తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు పెద్ద ఎత్తున విరాళాలు వస్తున్నాయి. దాతల సహాయం మరవలేనిది అని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ స్పష్టం చేశారు.


logo