Telangana | హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్నట్టు’ ఉన్నది 2008 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. వీరికి ఉద్యోగాలివ్వాలని హైకోర్టు ఆదేశాలిచ్చినా, కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలిస్తామని మంత్రి మండలి నిర్ణయం తీసుకున్నా అమలుకాక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితేం బాగాలేదు.
ఇప్పుడు మిమ్మల్ని ఉద్యోగాల్లోకి తీసుకుంటే వెంటనే జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. కాస్త ఓపికపట్టండి’ ఇవి 2008 డీఎస్సీ అభ్యర్థులతో ఓ మంత్రి అన్న మాటలు. ఉద్యోగాలు ఇవ్వాలని ఆరునెలల కిందటే క్యాబినెట్ నిర్ణయయించింది. త్వరలో మీ నియామకాలు జరుగుతాయని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులైన మంత్రులూ చెప్తున్నారు. ఈ నెల 27లోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయంగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనం వద్ద మాట ఇచ్చారు.
ఈ నేపథ్యంలో తమకు ఉద్యోగాలు వచ్చినట్టేనని భావిస్తున్న ఆ అభ్యర్థులు ఆ మంత్రి మాటతో ఇప్పడు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హైకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు.. డీఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 24న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలోనూ డీఎస్సీ 2008 బాధితులకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు ప్రచారం చేసింది. అధికారులు వివరాలు సేకరించగా దాదాపు 1,500 మంది వరకు ఉన్నట్టు తేలింది. నూతన విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యేనాటికి ఉద్యోగాల్లో చేరుతారని భావించారు.
క్యాబినెట్ సబ్ కమిటీ పేరుతో కాలయాపన
డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చే అంశంపై ప్రభుత్వం విధివిధానాల రూపకల్పన బాధ్యతను మంత్రి దామోదర రాజనర్సింహా నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీకి అప్పగిస్తూ మార్చి 14న ఉత్తర్వులు జారీచేసింది. మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. అప్పటి నుంచి అభ్యర్థులు మంత్రుల చుట్టూ, విద్యాశాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.
అదిగో, ఇదిగో అంటూ తిప్పుకుంటున్నారే తప్ప ప్రక్రియను పూర్తి చేయడం లేదు. ఈ కేసుపై ఈ నెల 8న హైకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా మూడు వారాల్లోగా నియామకాలు పూర్తి చేస్తామని ‘చివరి అవకాశం’ ఇవ్వాలని అడ్వకేట్ జనరల్ కోరడంతో.. ధర్మాసనం ఈ నెల 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది.