Contract Teachers | హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : వారంతా సర్కారు తప్పిదాలకు బాధితులు. అయినా అలుపెరగని పోరాటం చేశారు. సర్కారు కొలువులు సాధించాలని తహతహలాడారు. ఈ ప్రక్రియలో కోర్టుకెక్కారు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగారు. ఎట్టకేలకు కష్టపడి కాంట్రాక్ట్ టీచర్ కొలువునైతే సంపాదించారు. ఇలా డీఎస్సీ-2008లో నష్టపోయిన అభ్యర్థులకు సర్కారు కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించింది. ఇలా రాష్ట్రంలోని 1,389 మందిని సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీలు)గా నియమించింది. పాఠశాలల్లో పోస్టింగ్‌లు కూడా ఇచ్చింది. నెలకు రూ.31,040 వేతనంగా ఖరారు చేసింది. ఫిబ్రవరిలో వీరికి పోస్టింగ్ ఇచ్చారు. మార్చి 1న వేతనం అందలేదు. ఏప్రిల్ 1న కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మే1న వేతనం అందడం కష్టంగానే కనిపిస్తున్నది. అయితే వీరికింకా ఎంప్లాయ్ ఐడీలు ఇవ్వలేదు. జీతాల డ్రాయింగ్ ఆఫీసర్ ఎవరో స్పష్టత లేదు. వేతనాలు జమచేసేందుకు బ్యాంక్ ఖాతా నంబర్ తీసుకోలేదు.
పాన్‌కార్డులు అడగనేలేదు. ఉద్యోగం కోసం ఏండ్లకేండ్లు నిరీక్షించినట్టే, ఇప్పుడు వేతనాల కోసం మళ్లీ నెలల తరబడి నిరీక్షించాల్సి రావడంపై వారంతా కుమిలిపోతున్నారు. కొందరు బస్సు చార్జీలకు డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరి నియామక సమయంలో ఏటా ఏప్రిల్ 23న తొలగించి, మళ్లీ జూన్ 12న తిరిగి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏప్రిల్ 23న వీరిని ఉద్యోగాల నుంచి తొలగించాల్సి ఉన్నది. దీంతో వీరంతా నిరుద్యోగులైపోనున్నారు. ఇదే విషయంపై కొందరు కాంట్రాక్ట్ టీచర్లు ఇటీవలే ఓ ఉన్నతాధికారిని కలసి, తమ గోడు వెళ్లబోసుకోగా ‘ఉద్యోగం ఇచ్చిన మాకు జీతాలు ఇవ్వడం తెలియదా? అంటూ కసురుకోవడం కొసమెరుపు.