హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గం పరిధి దాటి రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్దేశించే సూచీగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టంలో అంతా ఊహించినట్టుగానే అధికార కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ విజయం ఖాయమని, కాంగ్రెస్ అభ్యర్థికి ఓటమి తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు తేల్చిచెప్పడంతో అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఓట్ చోరీకి బరి తెగించింది. 20 వేల మంది దొంగ ఓటర్లను రంగంలోకి దింపి ఎన్నికలో గెలవడానికి పన్నాగం పన్నినట్టు కాంగ్రెస్‌లోని కీలక వ్యక్తుల నుంచే సమాచారం అందింది.
కీలక మంత్రి పర్యవేక్షణలో వారం క్రితమే 20 వేల నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ముద్రించి పెట్టిన కాంగ్రెస్ పార్టీ, యాకుత్‌పురా, ఖైరతాబాద్, కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి 20 వేల మంది నకిలీ ఓటర్లను జూబ్లీహిల్స్‌లోకి చొప్పించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ప్రత్యేక వాహనాల ద్వారా రప్పించి బోరబండ, రహమత్ నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ తదితర బస్తీల్లోకి చొప్పించినట్టు సమాచారం. ఉదయం 7 గంటలకే నకిలీలను క్యూలైన్లలో నిలబెట్టి ఓట్లు వేయించాలని, తొలి రెండు గంటల్లోనే వీళ్లతో ఓట్లు వేయించి చెయ్యికి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయనే ప్రచారాన్ని సోషల్ మీడియాద్వారా విస్త్రృతంగా ప్రచారంలోకి తేవాలని వ్యూహ రచన చేసినట్టు కీలక వ్యక్తుల ద్వారా తెలిసింది. అధికార పార్టీ బరితెగింపులను ప్రతిఘటించడానికి, దొంగ ఓటర్లను గుర్తించి ఎన్నికల కమిషన్ ముందు నిలబెట్టడానికి బీఆర్ఎస్ శ్రేణులు సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు సమాచారం.
4.01 లక్షల మంది ఓటర్లున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో షేక్‌పేట్ మినహా మిగిలిన బస్తీల్లో కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా ఉన్నారు. వీళ్లలో ప్రస్తుతం కొందరు ఇక్కడి నుంచి స్వరాష్ర్టానికి వెళ్లిపోయారు. కానీ వారి ఓటు మాత్రం ఉన్నది. ఓటరుగా నమోదు సమయంలో ఖైరతాబాద్, యూసూఫ్‌గూడ, కార్వాన్, బహదూర్‌పురా, చార్మినార్, రాజేంద్రనగర్ ప్రాంతాల వ్యక్తులను ఇక్కడి ఓటర్లుగా నమోదు చేయించారు. ప్రధానంగా మహిళా ఓటర్లనే లక్ష్యంగా చేసుకొని ఓటు నమోదు చేయించినట్టు తెలిసింది. బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ తదితర బస్తీల్లో ఇలాంటి ఓట్లు ఎక్కువ ఉన్నట్టు సమాచారం.
10 రోజుల కిందటే ఇలాంటి వాళ్ల మీద దృష్టి పెట్టిన అధికార పార్టీ నేతలు 25 వేల మంది మహిళా ఓటర్లు అనుమానాస్పదంగా ఉన్నారని గుర్తించినట్టు సమాచారం. ఇందులో 15 వేల మంది దొంగ ఓటర్లు కాగా, మరో 10 వేల మంది మహిళా ఓటర్లు గతంలో ఇక్కడ నివశించి స్వస్థలాలకు వెళ్లారని గుర్తించారు. ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఓటరు లిస్టు ఆధారంగా వీరికి 20 వేలకు పైగా నకిలీ ఓటరు కార్డులను ముద్రించి, పోలింగ్ బూత్‌ల వారీగా పంపిణీ చేసినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 407 పోలింగ్ బూత్‌లు ఉండగా 320 బూత్‌లకు నకిలీ గుర్తింపు కార్డులను పంపిణీ చేసినట్టు సమాచారం.
నకిలీ గుర్తింపు కార్డుకు అనుగుణంగా ఖైరతాబాద్, యూసుఫ్‌గూడ, బహుదూర్‌పురా, కార్వాన్, కర్ణాటక రాష్ట్రం బీదర్, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి 20 వేల మందికి పైగా మహిళా ఓటర్లను సోమవారం సాయంత్రానికి జూబ్లీహిల్స్‌కు తరలించినట్టు తెలిసింది. ఎక్కువ శాతంలో ఉన్న ప్రత్యేక సామాజిక వర్గానికి చెందిన మహిళలను బోరబండ, రహమత్‌నగర్,యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ బస్తీల్లో సర్దుబాటు చేసినట్టు తెలిసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి 100 మంది ఓటర్లకు ఒక స్థానిక నాయకుడికి బాధ్యతలు అప్పగించింది.
పొరుగు ప్రాంతాల నుంచి రప్పించిన దొంగ ఓటర్ల బాధ్యత కూడా వీళ్లకే సర్దుబాటు చేసినట్టు తెలిసింది. ప్రతి దొంగ ఓటరుకు రోజుకు రూ.వెయ్యి, బీరు, బిర్యానీ, ప్రయాణ ఖర్చులు అదనంగా ఇస్తున్నట్టు సమాచారం. సోమవారం జూబ్లీహిల్స్‌కు వచ్చి మంగళవారం ఓటు వేసి వెళ్తారు కాబట్టి రెండు రోజుల పని దినాలుగా గుర్తించి ప్రతి దొంగ ఓటరుకు రూ.2000 చొప్పున చెల్లిస్తున్నట్టు తెలిసింది. ఉదయం ఏడు గంటలకే దొంగ ఓటర్లను క్యూలో నిలబెట్టి ఓట్లు వేయించాలని, తొలి రెండు గంటల్లో వీళ్ల ఓటింగ్‌ను పూర్తి చేయించి చెయ్యికి ఏకపక్షంగా ఓట్లు పడుతున్నాయని సోషల్ మీడియా ద్వారా విస్త్రృతంగా ప్రచారంలోకి తేవాలని వ్యూహ రచన చేసినట్టు కీలక వ్యక్తుల ద్వారా తెలిసింది.
దొంగ ఓటర్లను పక్కాగా తరలించి ఓటు వేయించేందుకు కీలక మంత్రి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల ద్వారా తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న షాడో సీఎంవో తరహాలోనే డివిజన్‌కు ఒక షాడో టీం చొప్పున ఏర్పాటు చేశారు. ముఖ్యనేత నీడలు+ అనుకూల ఐఏఎస్‌లు+ ఇంటెలిజెన్స్ పోలీసులు+ ఇతరులతో కలిపి రాష్ట్రంలో అనధికారికంగా షాడో సీఎంవో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే సూత్రాన్ని జూబ్ల్లీహిల్స్ బస్తీలకు వర్తింపజేశారు.
రౌడీ షీటర్లు, స్థానిక కాంగ్రెస్ నేతలు, ఇంటెలిజెన్స్ పోలీసులను, ప్రభుత్వ అధికారులను కలిపి డివిజన్‌కు ఒక షాడో టీం చొప్పున ఏర్పాటు చేశారు. సినిమా రంగం, ప్రపంచ సుందరి పోటీలతో సంబంధం ఉన్న ఇద్దరు షాడోలు ఈ టీంలను నడిపిస్తున్నట్టు తెలిసింది. ఇద్దరు షాడోలకు అనుసంధానంగా డివిజన్‌కు ఒక కార్పొరేటర్ లేదా కార్పొరేటర్ స్థాయి వ్యక్తులను పెట్టారు. ప్రతి 10 పోలింగ్ బూత్‌లకు ఒకరి చొప్పున కేటాయించి కార్పొరేటర్‌కు అనుసంధానంగా నియమించారు. వీరు 100 మంది ఓటర్ల బాధ్యులను నియంత్రిస్తారు. నంబర్ 2 మంత్రి పర్యవేక్షణలో ఈ చైన్ డబ్బులు పంచే దగ్గర నుంచి దొంగ ఓటర్ను పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లి ఓటు వేయించే వరకు బాధ్యత తీసుకున్నట్టు తెలిసింది.