కొత్తకోట, ఆగస్టు 28 : వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల గురుకుల పాఠశాలలో 200 మంది విద్యార్థినులు విషజ్వరాల బారినపడి వారం రోజులుగా చికిత్స పొందతున్న విషయం గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికల గురుకుల పాఠశాలలో 600 మందికి పైగా విద్యార్థినులు ఉండగా అందులో 200 మందికి వారం రోజుల కిందట జ్వరాలు వచ్చినట్టు తెలిసింది.
ఇద్దరికి టైఫాయిడ్ కాగా అందరికీ వైరల్ ఫివర్ ఉందని, వంద మంది విద్యార్థినులు ఇండ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ నాయకులు.. మాజీ జడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్, మాజీ సీడీసీ చైర్మన్ బీసం చెన్నకేశవరెడ్డి, అయ్యన్న గురుకులానికి చేరుకొని పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా 200 మంది విష జ్వరాలకు గురైతే గుట్టు చప్పుడు కాకుండా చికిత్స చేయిస్తూ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థులకు ఏమైనా జరిగితే ప్రిన్సిపాల్‌తోపాటు సిబ్బందే బాధ్యత వహించాలని హెచ్చరించారు. గురుకుల ప్రిన్సిపాల్ మాధవిని వివరణ కోరగా విషజ్వరాలు 60 మందికి మాత్రమే వచ్చాయని చెప్పారు.