Telangana | హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బీర్ బౌల్గా మారనున్నది. రాష్ట్రంలో ఇప్పుడున్న వివిధ రకాల బీర్లకు తోడుగా మరో 200 రకాల బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి. యువతను ఆకర్షించటం కోసం నాన్ ఆల్కహాలిక్ బీర్లకు కూడా చోటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విధివిధానాలు రూపొందించే పనిలోఎక్సైజ్ శాఖ నిమగ్నమైంది. త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఉగాది పండుగ నుంచే కొత్త బ్రాండ్లను దించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానున్నది.
తాగితాగి మొఖం మొత్తి..
తెలంగాణలో 85 రకాల లోకల్ బ్రాండ్ బీర్లు, 385 రకాల జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్ బీర్ల సరఫరాకు మాత్రమే అనుమతి ఉన్నది. వీటిలో దాదాపు 40 శాతం బ్రాండ్లు కాలంతో పోటీపడలేక, ఆదరణ కరువై దుకాణం ఎత్తేశాయి. నికరంగా 100 నుంచి 150 రకాల బ్రాండ్లు మాత్రమే నిలిచాయని, గత పదేండ్లుగా ఇవే బ్రాండ్లు మార్కెట్లో చలామణిలో ఉండటంతో బీరు ప్రియులకు మొఖం మొత్తిందని ఎక్సైజ్ శాఖ నివేదించింది.
రండీ..బాబూ రండీ..! యువత తాగాలే..
టీజీబీసీఎల్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో ఏటా 10 శాతం మంది కొత్తగా మద్యానికి అలవాటు పడుతుంటారు. గత ఐదేండ్లలో కొత్తగా బీరు తాగేవారి సంఖ్య తక్కువగానే ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. యువతను ఆకర్షించే బీరు అందుబాటు లేకపోవటమేనని తేల్చింది. నాన్ఆల్కహాల్ బీరులో 0.5 శాతం ఆల్కహాల్తోపాటు, తాపకరమైన విలువలు కలిగి ఉంటుందని, యువత ఎక్కువ ఇష్టపడతారని ఆ శాఖ అంచనా వేస్తున్నది. మొత్తంగా మార్చి నెల చివరి నాటికి ప్రముఖ బీరు బ్రాండ్లు మార్కెట్లోకి తీసుకు వచ్చే విధంగా ఎక్సైజ్ అధికారులు బీరు పాలసీ రూపొందిస్తున్నారు.