హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): బీసీల సంక్షేమానికి 2024-25 బడ్జెట్లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమారకు సోమవారం ఆమె లేఖ రాశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని కవిత గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి వచ్చే ఐదేండ్ల్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని, ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని వాగ్దానం చేసిందని తెలిపారు. బీసీలు మరింత అభివృద్ధి చెందడానికి రూ.20 వేల కోట్ల నిధులు దోహదపడుతాయని తెలిపారు.