వ్యక్తిగత.. స్వార్థ ప్రయోజనాలు, కాంట్రాక్టర్ల లాభం కోసం ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌ను మార్చి రూ.20 వేల కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై వేస్తరా? మీ లాభం కోసం 20వేల కోట్ల అప్పు చేస్తరా? ఆరు గ్యారెంటీలకు నిధుల్లేవుగానీ రోడ్డు కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు పెడుతరా? ఇదేనా మార్పు అంటే? రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండినయ్. చెరువుల్లో పుష్కలంగా నీళ్లున్నయ్. అయినా సగం చేపపిల్లలే సరఫరా చేయాలని ఆదేశించుడేంది?
హైదరాబాద్, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ మార్చడం వల్ల రాష్ట్ర ప్రజలపై రూ.20 వేల కోట్ల భారం పడుతుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. దక్షిణ భాగం రోడ్డుకు కేంద్ర ప్రభుత్వ కన్సల్టెన్సీ సంస్థ నివేదికకు వ్యతిరకంగా అలైన్మెంట్ మార్చడంతో కేంద్రం నిధులు కేటాయించదని, రాష్ట్ర నిధులతోనే పనులు చేపట్టాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ఇందుకు రూ.20 వేల కోట్లు అదనంగా ఖర్చవుతాయని, నిధులు అప్పు తెచ్చి పెడితే భారమంతా ప్రజలపైనే పడుతుందని చెప్పారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియా ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. సీఎం అనుచరులు, ముఖ్యుల ప్రయోజనాల కోసం ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చారని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగం 158 కిలోమీటర్లకు బీఆర్ఎస్ హయాంలోనే కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని, భూసేకరణ కోసం 3ఏ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్తయినా భూసేకరణ ముందుకు సాగడంలేదని, దీనిపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో యుద్ధ ప్రాతిపదికన మారెట్ విలువ ప్రకారం రైతులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
దక్షిణ భాగం అలైన్మెంట్ 182 కిలోమీటర్ల ప్రతిపాదనలతో ఐసీటీ సంస్థ నివేదిక ఇచ్చిందని హరీశ్ వివరించారు. కాంగ్రెస్ వచ్చాక సీఎం, ఆయన అనుచరులు, ముఖ్యుల కోసం ఈ అలైన్‌మెంట్‌ను పూర్తిగా మార్చారని, దీంతో అది కాస్తా 198 కిలోమీటర్లకు పెరిగిందని చెప్పారు. ఇందులో ప్రముఖుల భూములు ఉన్నాయని తెలిపారు. ఒకసారి ఫైనల్ చేసిన అలైన్‌మెంట్‌ను మార్చేందుకు జాతీయ రహదారుల సంస్థ ఒప్పుకోదని, ఈ విషయం తెలిసీ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ సర్కార్ అలైన్మెంట్ మార్చిందని ధ్వజమెత్తారు. దీనికి కేంద్రం ఒప్పుకోకుంటే రాష్ట్రంపైనే నిధుల భారం పడుతుందని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ అధికారంలోకొస్తే రెండు చీరలు ఇస్తామన్న రేవంత్‌రెడ్డి ఈ సారి బతుకమ్మకు ఒక్క చీర కూడా ఇవ్వలేదని హరీశ్ మండిపడ్డారు. రైతుబంధు రూ.15వేలు ఇస్తామని చెప్పి వానకాలం పంటకు రూపాయి కూడా వేయలేదని, కేసీఆర్ కిట్ బంద్ చేశారని విమర్శించారు. చెరువుల్లో చేప పిల్లలు వదలడం లేదని, గొర్రెల పంపిణీ చేయడం లేదని కాంగ్రెస్ చెప్పిన మార్పు అంటే ఇదేనా? అని ఎద్దేవా చేశారు. ఫిషరీష్ కమిషనర్ సగం మాత్రమే చేప పిల్లలు పంపిణీ చేయాలని అధికారికంగా ఆదేశాలు జారీ చేశారని, చెరువులు పూర్తిగా నిండినా సగం చేపపిల్లలే సరఫరా చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఆగస్టులో పోయాల్సిన చేప పిల్లలను అక్టోబర్ వచ్చినా పోయలేదని చెప్పారు. చేప పిల్లల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.150 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ సర్కారు బడ్జెట్లో పెట్టింది కేవలం రూ.16 కోట్లేనని గుర్తుచేశారు.
మహిళలకు రెండు బతుకమ్మ చీరలు ఇస్తమని కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు ఉన్న చీర కూడా పోయింది. పండుగపూట ఆడబిడ్డలకు సంతోషమే లేకుండా జేసిండ్రు.. ఇదేనా మార్పు అంటే
-హరీశ్‌రావు
ఆర్థిక సంవత్సరం ఏడు నెలలైనా ఇంత వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఎందుకు విడుదల చేయలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సంవత్సరానికి రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తామని బడ్జెట్ ప్రతిపాదించారని కానీ ఇంత వరకు జీవో కూడా విడుదల కాలేదని తెలిపారు. ప్రజాపాలన అని గొప్పగా చెప్పిన ప్రభుత్వం బడ్జెట్లో పొందుపర్చిన విధంగా ఎందుకు విడుదల చేయడంలేదని నిలదీశారు.
మెడికల్ సీట్లలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరిందని హరీశ్‌రావు తెలిపారు. తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వైద్యవిద్యకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ నిలిచిందని బుధవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నాడు అందని ద్రాక్షగా ఉన్న వైద్యవిద్య, నేడు సాధారణ ప్రజలకు చేరువైందని వివరించారు. ఉమ్మడి పాలనలో ఐదు మెడికల్ కాలేజీలు ఉంటే, బీఆర్ఎస్ 34 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, 2014 వరకు తెలంగాణలో 2,850 ఎంబీబీఎస్ సీట్లు ఉంటే నేడు 8,490 సీట్లకు చేరాయని గుర్తుచేశారు. ఇది కేసీఆర్ మార్ పాలన అని, మార్పు పేరు చెప్పి ఎవరూ చెరిపేయలేరని ఇది ఆల్‌టైం రికార్డు అని స్పష్టంచేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన అప్పుల ప్రకటనను ఖండిస్తున్నట్టు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.49,618 కోట్ల అప్పు తీసుకున్నదని ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రకటనలో పేరొన్నారని తెలిపారు. అయితే, 2024 జూలై 26న అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా, ప్రభుత్వం రూ.24,887.71 కోట్ల ప్రభుత్వరంగ సంస్థల రుణాలకు హామీ ఇచ్చినట్టు వెల్లడించారని హరీశ్‌రావు తెలిపారు. టెస్కాబ్, ఎన్సీడీసీ నుంచి మరో రూ.5 వేల కోట్ల రుణాన్ని అదనంగా పొందినట్టు పేర్కొన్నారు. ఇవన్నీ కలిపి కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో తీసుకున్న మొత్తం రుణం రూ.80 వేల కోట్లుగా ఉన్నదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా నెరవేర్చని, మోసపూరిత హామీలు చాలా ఉన్నాయని వాటిని నంబర్లతో సహా వివరించారు.