హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ప్రపంచానికి కరోనా ముప్పు పూర్తిగా తొలిగిపోలేదు. ప్రస్తుతం చైనా లాంటి దేశాల్లో ‘స్టెల్త్’ వేరియంట్ విజృంభిస్తున్నది. మన దేశంలో సైతం కొన్ని రాష్ర్టాల్లో వారం రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను కాపాడే ఏకైక ఆయుధం వ్యాక్సినే. ఇప్పటికే రెండు డోసుల టీకాలు వేసుకొన్నవారికి కరోనా రెండో, మూడో వేవ్‌లలో రక్షణ లభించింది. ఇప్పుడు మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా ప్రికాషన్ (బూస్టర్) డోస్ టీకా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఉదారంగా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ ప్రక్రియ నుంచి క్రమంగా తప్పుకొంటున్నది. ఆ బాధ్యతను ప్రైవేట్ శక్తులకు అప్పగిస్తున్నది.
కేంద్రం ఈ నెల 9న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. 18 ఏండ్ల వయసు దాటినవారంతా ప్రికాషన్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే మోదీ సర్కారు ఓ మెలిక పెట్టింది. 60 ఏండ్లు పైబడినవారికి మాత్రమే ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా ప్రికాషన్ డోసు వేస్తున్నది. 18-59 ఏండ్ల వారంతా ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి సొంత డబ్బుతో టీకా వేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఒక్కో టీకాకు కనీసం రూ.350 ఖర్చు అవుతున్నది. నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం ప్రికాషన్ డోసుల కోసం రూ.1,500 వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో కోట్ల కుటుంబాలు సతమతమవుతున్నాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో కలిపి 20 కోట్లకుపైగా డోసులు అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇప్పటికే మరికొన్ని డోసులకు ఆర్డర్ ఇచ్చింది. ప్రభుత్వ కేంద్రాల్లో రోజుకు సగటున 6-8 లక్షల టీకాలు మాత్రమే వేయగలుగుతున్నారు. మిగిలినవి నిల్వలుగా పేరుకుపోతున్నాయి. ఈ లెక్కన ఇప్పుడున్న 20 కోట్ల డోసులు పూర్తి కావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. ప్రస్తుతం అన్ని రాష్ర్టాల్లో మొదటి రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు 100 శాతానికి చేరినందున మున్ముందు టీకాల పంపిణీ మరింత తగ్గుతుంది. కొవిడ్ టీకాల కాలపరిమితి గరిష్ఠంగా మూడు నెలలు మాత్రమే. రాష్ర్టాల్లో పేరుకుపోయిన నిల్వలను వెంటనే వినియోగించకుంటే అవి మురిగిపోయి వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యే ప్రమాదం ఉన్నది.
తెలంగాణలో గురువారం నాటికి 43.58 లక్షల డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయి. 18 ఏండ్ల వయసు దాటినవారికి రెండు డోసుల పంపిణీ 100% పూర్తయింది. వీరిలో సుమారు 18 లక్షల మంది ప్రికాషన్ డోస్‌కు అర్హులుగా ఉన్నారు. కేంద్రం అనుమతి ఇస్తే.. ఇప్పుడున్న నిల్వలతోనే వీరందరికీ ప్రికాషన్ డోస్ వేసేందుకు వీలవుతుంది. ఈ నేపథ్యంలో 18 ఏండ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఇటీవలే కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాశారు. 18 ఏండ్ల వయసు దాటిన వారంతా ప్రికాషన్ డోస్ తీసుకోవాలని చెప్తున్న కేంద్రమే వారిని ప్రైవేటు కేంద్రాలకు పరిమితం చేయడం దారుణమని పేర్కొన్నారు. కొత్త వేరియంట్లు పుట్టుకు వస్తుండటం, కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉన్నదనే అంచనాల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా రెండు డోసులు వేయించుకొని ప్రికాషన్ డోస్‌కు అర్హులైనవారు కోట్లలో ఉన్నారని, వారికి ప్రభుత్వ కేంద్రాల్లోనే ప్రికాషన్ డోస్ ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. అయినా కేంద్రం ఇప్పటికీ స్పందించ లేదు.